
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
వేర్వేరు చోట్ల ఇద్దరు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
పెద్ద శంకరంపేట(మెదక్): వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్ కథనం ప్రకారం... మక్త లక్ష్మాపూర్‌కు చెందిన నాగధర్ బేతయ్య(50) తాను సాగు చేస్తున్న వరి పంటను అడవి పందుల నుంచి రక్షించేందుకు చుట్టూ విద్యుత్ వైర్లను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగలడంతో రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో కరెంట్ రావట్లేదని చెక్ చేస్తుండగా..
మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లద్నూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మచ్చ యాదగిరి(48) అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో జరిగే బొడ్రాయి పండుగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం ఇంట్లో కరెంట్ రాకపోవడంతో విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లి చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.