
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.
పటాన్‌చెరు టౌన్: స్కూటీని కారు ఢీకొట్టిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ భూపాల్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (50), అతడి బంధువు ఎం.డి ఖాజా ఇరువురు కలిసి శనివారం స్కూటీపై కిష్టారెడ్డిపేట్ వైపు నుంచి పటాన్‌చెరు వైపు వస్తుండగా మార్గమధ్యలో ఎల్లంకి కాలేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం షేక్ ఇబ్రహీంను మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని ఒకరు..
హత్నూర(సంగారెడ్డి): ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో దౌల్తాబాద్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగింది. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం... మాదుర గ్రామానికి చెందిన లింగన్నగారి దశరథ్ రోజువారి మాదిరిగానే దౌల్తాబాద్ వచ్చి రాత్రి స్వగ్రామానికి తన మోటార్ సైకిల్ పై తిరిగి వెళ్తున్నాడు. దేవులపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే హత్నూర వైపు నుంచి ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథ్ (45)తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ దశరథను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గాయాలైన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. మృతుడి భార్య వీరమని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఎమ్ శివయ్య (52) సోమవారం పట్టణంలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. తిరిగి తన ద్విచక్ర వాహనంపై సిద్దిపేట నుంచి రామునిపట్ల వైపు వెళుతుండగా మందపల్లి స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.