
నిజాయితీ చాటుకున్న కండక్టర్
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన పర్సును కండక్టర్ గుర్తించి డీఎంకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం మోడ్రన్ బస్టాండ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. సిద్దిపేట డిపో మేనేజర్ టి.రఘు వివరాల ప్రకారం... డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు నీరజ బస్సులో వస్తున్నది. ఆమె ముస్తాబాద్‌లో బస్సు దిగే క్రమంలో పర్సు మరిచిపోయింది. దీంతో సిద్దిపేటకు వచ్చిన తరువాత బస్సులో ఉన్న పర్సును కండక్టర్ వేణుగోపాల్ గుర్తించి డిపో మేనేజర్‌కు అందజేశాడు. అనంతరం పర్సులో ఉన్న 10గ్రాముల బంగారం, రూ.10వేలను సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్‌లో ప్రయాణికురాలికి డీఎం, స్టేషన్ మేనేజర్ బాలకిషన్, సెక్యూరిటీ సురేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికురాలు డీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఆర్టీసీ బస్సులో తాను ప్రయాణం చేయకుండా ఉంటే నష్టం జరిగేదని ఆమె పేర్కొన్నారు.
పర్సును ప్రయాణికురాలికి అందజేసిన డీఎం