
అప్పులు.. ఆపై కుటుంబ కలహాలు
వ్యక్తి ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని అల్వాలలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ పరశురామ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొగాకు స్వామి (31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. ఇటీవల అందినకాడికి అప్పులు చేసి రూ. 11 లక్షలతో బొలేరో వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనం కొన్న నాటి నుంచి సరైన గిరాకీలు లేక తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోయాడు. దీనికి తోడు ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట (మెదక్): గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... పాపన్నపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఉండటాన్ని శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి వయస్సు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఒంటిపై కుంకుమ రంగు షర్టు, నలుపు గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బట్టి, సుమారు పది– పదిహేను రోజుల క్రితం ఉరి వేసుకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి..
మునిపల్లి(అందోల్): ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... ఈ నెల 23న ఉదయం శ్రీనివాస్(40) ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులో చెట్టుకు ఊరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సమస్యలతో వ్యక్తి...
రామాయంపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఝాన్సీలింగాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్వాల రాజు (35) మిషన్ భగీరథ వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యతో గొడవ పడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామంలో ఓ రైతు పంట చేను వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు.. ఆపై కుటుంబ కలహాలు