
భూ భారతితో అధికార వికేంద్రీకరణ
పటాన్‌చెరు: భూ భారతి (భూమి హక్కుల చట్టం–2025)ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీరంగూడలో శనివారం నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...భూ భారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పారదర్శకత జవాబుదారీతనమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. ఈ చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరాలని ఆకాక్షించారు. భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రైతులు, ప్రజల మేలు కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివరించారు.
పూర్తిస్థాయి అవగాహన కోసమే...
ఈ చట్టంపై పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపా రు. ప్రభుత్వం భూ భారతి చట్టంతోపాటు, నియ మ నిబంధనలు ఒకేసారి తయారు చేసిందని, రికార్డుల నిర్వహణ, సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామ,పౌతి వంటి అంశాలను వివరించా రు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రపురం మండలాల తహసీల్దారు లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు రైతు సంఘ నాయకులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడాలి
అమీన్‌పూర్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. అమీన్‌పూర్‌లో శనివారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అమీన్ పూర్ మండలం పరిధిలోని 993 సర్వే నంబర్ ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూములలో బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుర్తించిన ప్రభుత్వ భూముల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ క్రాంతి వల్లూరు