
28న భూ భారతి అవగాహన సదస్సు
హాజరుకానున్న మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ
హత్నూర (సంగారెడ్డి): ఈ నెల 28న భూ భారతి చట్టంపై దౌల్తాబాద్ సమీపంలో జరగనున్న అవగాహన సదస్సుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహ హాజరవుతున్నట్లు తహసీల్దార్ పర్వీన్ షేక్ వెల్లడించారు. హత్నూర తహసీల్దార్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పర్వీన్‌షేక్ మాట్లాడుతూ... హత్నూర తహసీల్దార్ నూతన భవన నిర్మాణం కోసం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారన్నారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో రూ.రెండు కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డార్మెటరీ భవనం కూడా మంత్రులు కలెక్టర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. భూ భారతి అవగాహన సదస్సుకు మండలంలోని అన్ని గ్రామాల రైతులు హాజరు కావాలని కోరారు.
29న డిగ్రీ కళాశాలలో
జాబ్ మేళా
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అస్లాం ఫారూఖీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే జాబ్‌మేళాలో ఎంఆర్‌ఎఫ్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఎస్‌ఎన్ లేబోరేటరీస్, పేటీఎం తదితర కంపెనీల హెచ్‌ఆర్‌లు, ,మేనేజర్లు హాజరవుతున్నారని చెప్పారు. 500పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9959845076 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
కీబోర్డ్ వాయిద్యంలో
గిన్నిస్ రికార్డ్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): భారతీనగర్ డివిజన్ పరిధిలో ఎంఐజీ కాలనీ చెందిన వాగుల మధురవాణి, ఆమె కుమార్తెలు పెర్లి క్రిస్టీన్, క్యాథీలకు కీబోర్డ్ వాయిద్యంలో గిన్నిస్‌బుక్ రికార్డ్‌ను సాధించారు. ఈ సందర్భంగా శనివారం పటాన్‌చెరు ప్రభుత్వ మైనార్టీ కళాశా ల వైస్‌ప్రిన్సిపాల్ మధురవాణి మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్‌లో విజయవాడకు చెందిన హలేల్ సంగీత పాఠశాల నిర్వాహకులు అగస్టీన్ ఆధ్వర్యంలో 1,046 మంది ఒకేసారి కీబోర్డ్ ప్లేయింగ్ ప్రదర్శనను చేపట్టారన్నారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు తన కుమార్తెలు క్రిస్టీన్, క్యాథీలు కూడా పాల్గొన్నారు. ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో గిన్నీస్ బుక్ వారు పరిశీలించి రికార్డుల్లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ఈనెల 14న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు తెలిపారు.
ఈదురు గాలులు..
భారీ వర్షం
నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమైంది. వర్షం వల్ల మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. కోతలు కోసిన వరి పొలాల్లో నీరు నిలవడంతో నష్టం సంభవించనున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని భూమయ్య కాలనీలో విద్యుత్ వైర్లపై రేకులు ఎగిరి పడటంతో రెండు గంటలపాటు సరఫరా నిలిచిపోయింది.
జిన్నారం మండలంలో..
జిన్నారం (పటాన్‌చెరు): ఉమ్మడి జిన్నారం, గుమ్మడిదల మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం ప్రభావంతో మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

28న భూ భారతి అవగాహన సదస్సు