
18 ఏళ్లు నిండిన వారికి సైటీబీ పరీక్షలు
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి
సంగారెడ్డి: క్షయ వ్యాధి సోకిన వారితో ఉండే 18 ఏళ్లు నిండిన వారందరికీ సైటీబీ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి వెల్లడించారు. సంగారెడ్డి మార్క్స్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధి ఉన్న రోగులతో కాంటాక్ట్ అయిన 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఈ సైటీబీ నిర్ధారణ పరీక్ష చేసి లేటెంట్ టీబీ వ్యాధిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సైటీబీ పరీక్షలు సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి సీహెచ్ అరుణకుమారి, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శశికర్, సూపర్ వైజర్ శ్రీనివాస్, సీహెచ్ నర్సారెడ్డి, డాక్టర్ కరుణకుమారి పాల్గొన్నారు.