
మేలుకో.. ధ్రువపత్రం ముందే తీసుకో
సెలవులని ఆలస్యం చేయొద్దు
● విద్యార్థులకు ఇదే సరైన సమయం ● సెలవులు ముగిస్తే మీ సేవాకేంద్రాల వద్ద పెరగనున్న రద్దీ ● ధ్రువపత్రాల జారీలో ఆలస్యం అయ్యే అవకాశం ● ముందే జాగ్రత్త పడితే మేలు
ఇటీవల పరీక్షలు రాసిన విద్యార్థులు
ప్రాథమిక పాఠశాలలు 63,877
పదో తరగతి 10,388
ఇంటర్ ఫస్ట్ ఇయర్ 6,153
సెకండియర్ 5,572
మొత్తం 85,990
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు ఉన్నత తరగతుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన ధ్రువ పత్రాలు పొందడానికి ఇదే మంచి సమయం. వేసవి సెలవులు ముగియగానే విద్యార్థులందరూ ఒకేసారి సర్టిఫికెట్ల కోసం మీసేవల వద్దకు గుమిగూడుతారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో మీ సేవలో దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యమవుతుంది. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ప్రతీ దరఖాస్తు పరిశీలించడంతో ధ్రువపత్రాల జారీ జాప్యం జరుగుతుంది. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవుల్లోనే నూతన విద్యా సంవత్సరానికి కావాల్సిన ధ్రువ పత్రాల కోసం దరఖాస్తు చేసుకొని తీసుకోవడం ఉత్తమం.
ప్రతీ విద్యార్థికి అవసరం
విద్యార్థులకు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు, స్కాలర్‌షిప్‌లకు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కుల, ఆదాయ, స్థానిక ధ్రువపత్రాలు తప్పనిసరి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 1 నుంచి 10 తరగతుల విద్యార్హత సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు. ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతోపాటు విద్యాపరంగా గ్యాప్ ఉంటే దానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసే పత్రం అవసరం ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు తమ పరిధిలోని ఠాణా నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ, నివాస ధ్రువపత్రాలను అవసరం మేరకు ప్రతీ సంవత్సరం తీసుకోవాల్సి వస్తుంది. 22న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. త్వరలో పదో తరగతి ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పై చదువులు చదవడానికి విద్యార్హత పత్రాలతోపాటు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోవచ్చు
కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డులతోపాటు బోనఫైడ్‌లు, ఫొటోలు జత చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులు ఆధార్, రేషన్‌కార్డుతోపాటు న్యాయవాది అఫిడవిట్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల హామీ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఈ విద్యార్థుల కుటుంబాలకు 100 చదరపు అడుగుల స్థలం కూడా ఉండకూడదు. మండల రెవెన్యూ అధికారి, ఉప తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా రిపోర్టును తహసీల్దార్ లాగిన్‌కు చేరవేస్తారు. అన్ని పత్రాలను తహసీల్దార్ పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం చేస్తారు. అనంతరం సంబంధిత విద్యార్థి దరఖాస్తు ఫారమ్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ వచ్చిన వెంటనే మీ సేవా ద్వారా విద్యార్థులు ధ్రువ పత్రాలను పొందవచ్చు.
రెండు రోజుల్లో అందిస్తాం
మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తున్నాం. అత్యవసరమైతే తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మణ్‌బాబు, తహసీల్దార్, మెదక్