తాటి ముంజల బజ్జీ.. క్రేజీ | - | Sakshi
Sakshi News home page

తాటి ముంజల బజ్జీ.. క్రేజీ

Published Tue, Apr 29 2025 9:53 AM | Last Updated on Tue, Apr 29 2025 10:09 AM

తాటి

తాటి ముంజల బజ్జీ.. క్రేజీ

● హుస్నాబాద్‌ నోరూరిస్తున్న బజ్జీలు ● ఇష్టంగా తింటున్న కల్లు ప్రియులు ● రూ.100కి ఆరు చొప్పున విక్రయం ● ఎండాకాలంలో తాటి ముంజలతోశరీరానికి చల్లదనం

హుస్నాబాద్‌: బజ్జీలు రకరకాలుగా ఉంటాయి. సామాన్యంగా బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీ లు, హెగ్‌ బజ్జీలు పేర్లే విన్నాం. ఇక్కడ మాత్రం ముంజకాయల బజ్జీలు ఫేమస్‌. ఈ బజ్జీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకవు. కేవలం భగ భగ మండే ఎండాకాలంలో ముంజల సీజన్‌లోనే దొరుకుతాయి. పచ్చి ముంజలతోపాటుగా తాటి ముంజల బజ్జీలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు.

హుస్నాబాద్‌ పట్టణ శివారులోని పందిల్ల రోడ్డామ్‌ సమీపంలోని హుస్నాబాద్‌, సిద్దిపేట హైవేలోని తాటి వనంలో ఆంజనేయులు కల్లు తాగే వారి కోసం స్టఫ్‌ దుకాణం నడిపిస్తున్నాడు. ఇతడు అమ్మే వాటిలో తాటి ముంజల బజ్జీలు ఫేమస్‌. బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఆంజనేయులు దగ్గర కల్లు ప్రియులు రోడ్డు నుంచి వెళ్లే వారు కొనుక్కుంటారు. తాటి వనంలో అమ్మే స్టఫ్‌కు బదులుగా ముంజల బజ్జీలను ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. ఈ తాటి ముంజలను శనగపిండిలో కారం, ఉప్పు, సోడా వేసి కలుపుతాడు. తర్వాత ముంజలను పిండిలో ముంచి నూనె కడాయిలో వేస్తాడు. సామాన్యంగా బజ్జీలను ఎలా తయారు చేస్తారో అదే విధంగా ముంజలను బజ్జీలుగా తయారు చేస్తాడు. ఎర్రగా బాగా కాలిన తర్వాత బజ్జీలను తీసి అమ్ముతుంటాడు. రూ.100కి ఆరు చొప్పున అమ్ముతాడు. మోదుగాకులో పెట్టి మరీ ఇస్తాడు. కల్లు ప్రియులు కల్లు తాగుతూ లోట్టలు వేసుకుంటూ తింటున్నారు. కల్లు తాగని వారు ఇంటికి తీసుకెళ్తారు. ఆర్డర్‌ పై కూడా ముంజల బజ్జీలు తయారు చేసి ఇస్తున్నాడు ఈ ఆంజనేయులు.

ముంజుల విక్రయం ఎక్కువే..

ఎండాకాలంలో పండ్ల రసాలు, జ్యూస్‌లు, నిమ్మరసం తాగితే శరీరానికి మంచిది. కడుపులో చల్లగా ఉంటుంది. ఈ రసాలు ఏ కాలంలోనైనా దొరుకుతాయి. కానీ ఎండాకాలంలో తాటి ముంజకాయలకు భలే గిరాకీ ఉంటుంది. తాటిముంజలు తింటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కడుపులో చల్లగా ఉండి శరీరానికి మంచిదని చాలా మంది తాటి ముంజలను అమితంగా ఇష్టపడుతారు. చిరు వ్యాపారులు తాటి గెలలను గీత కార్మికుల నుంచి కొనుగోలు చేసి ముంజలు తీసి అమ్ముతుంటారు. రూ.100కి 12 చొప్పున విక్రయిస్తుంటారు.

తాటి ముంజల బజ్జీ.. క్రేజీ1
1/1

తాటి ముంజల బజ్జీ.. క్రేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement