
ఇరు వర్గాల మధ్య విభేదాలు
మిరుదొడ్డిలో పోలీసుల పికెట్
మిరుదొడ్డి(దుబ్బాక): ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఓ వర్గం యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఒక వర్గానికి చెందిన యువకులు శనివారం రాత్రి మిరుదొడ్డి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఇదే గ్రామానికి చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడు సోషల్ మీడియాలో కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేశాడు. దీంతో తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోస్టు పెట్టిన యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేయడానికి ఒక వర్గం యువకులు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే యువకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో సదరు యువకుడిపై అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆదివారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ర్యాపిడ్ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాను మంచికి వాడకుండా ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.