
సోలార్ కుంటలు
వన్యప్రాణుల దాహార్తికి
సౌరశక్తితో నీటి సరఫరా
● చెక్ డ్యామ్‌లు, కుంటల్లో నీరు అడుగంటడంతో ప్రత్యామ్నాయ చర్యలు ● నీరు లేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్న జంతువులు ● శనిగరం, మీర్జాపూర్, గురువన్నపేట ఫారెస్టులో ఏర్పాటుకు ప్రతిపాదనలు ● హుస్నాబాద్ ఫారెస్టు పరిధిలో7 మండలాలు 4వేల హెక్టార్లు
నీరు తాగుతున్న దుప్పిలు
నీటి సరఫరాకు ట్యాంకర్లు ఇవ్వాలి
వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో అడవిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. మేము నిర్మించే సాసర్ పిట్లకు నీటి సరఫరా కోసం సమీపంలోని గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. శనిగరం, మీర్జాపూర్, గురువన్నపేట అటవీ ప్రాంతంలో సౌరశక్తి పంపుల ద్వారా నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరైతే అడవిలో నిరంతరం జంతువులకు నీరు దొరుకుతుంది. అడవిలో పలు రకాల జంతువులు ఉన్నాయి. పులులు ఇప్పటి వరకు ఎక్కడా కెమెరాలకు చిక్కలేదు.
– సిద్ధార్థరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ, హుస్నాబాద్
హుస్నాబాద్ రూరల్: వేసవిలో అడవిలో నీటి వనరులు లేక దాహం కోసం బయటకు వచ్చిన జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు బలై మృత్యువాత పడుతున్నాయి. జింకల మందలు మైదానానికి రావడంతో కుక్కలు తరుమడంతో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అడవి జంతువుల దాహార్తి తీర్చడానికి సోలార్ పంపుల ద్వారా నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వేసవిలో సైతం నీటి కుంటలు నిండుగా ఉంటే జంతువులు అడవి విడిచి బయటకు రావనే ఆలోచనతో అధికారులు సౌరశక్తి కుంటల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. దుబ్బాక ఫారెస్టు పరిధిలో చింతమడక, చీకోడులో సోలార్ కుంటలు నిర్మించి జంతువులకు నీరు అందిస్తున్నారు.
హుస్నాబాద్ ఫారెస్టు..
హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, ధూలిమిట్ట, చేర్యాల ఏడు మండలాల్లో 4వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అడవిలో జింకలు, కొండ గొర్రెలు, నక్కలు, ఎలుగు బంట్లు, హైనా, నెమళ్లు లాంటి జంతువులు ఉన్నాయి. 2017లో మహ్మదాపూర్ గుట్టల్లో చిరుతపులి దాహం కోసం వ్యవసాయ బావుల వద్దకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి బలైపోయింది. అప్పటి నుంచే జంతువుల దాహార్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 3వేల నుంచి 5వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 19 సాసర్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. వర్షాకాలం నీటిని నిల్వ చేయడానికి లోతట్టు ప్రాంతంలో 10 చెక్ డ్యామ్‌లు, 8 కుంటలను నిర్మించారు. హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ అటవీ ప్రాంతంలో మహాసముద్రం, జిల్లెలగడ్డలో గాడిదలలొద్ది చిన్ననీటి జలాశయాలను నిర్మించడంతో జంతువులు బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
బాంబుల శబ్దాలకు భయపడి బయటకు..
ఉమ్మాపూర్ అటవీ ప్రాంతంలో మిషన్లతో గుట్టలను తవ్వడం, బండరాళ్లను తొలగించడానికి బాంబులను వినియోగించడం వల్ల పెద్ద పెద్ద శబ్దాలకు జంతువులు భయపడి బయటకు వస్తున్నాయి. అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ ప్రాంతంలో గుట్టల తవ్వకాలను, బాంబు పేలుళ్లను నిషేధించాలని వన్యప్రాణుల సంరక్షణ సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.