
భూ భారతిపై రైతులకు అవగాహన
మునిపల్లి(అందోల్)/కంది (సంగారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి పథకంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ హరినందన్‌రావు, తహసీల్దార్ గంగాభవానీ, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భూ భారతి పథకంపై అవగాహన సదస్సు కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు కంది మండలంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తారని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శబడి పథకం ద్వారా పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతులు చేపడుతుందని చెప్పారు. విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, డ్రెస్సుల ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కందిలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి తహసీల్దార్ ఆశాజ్యోతితోపాటు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ రేవతి, ఆర్‌ఐ సుభాష్, శృతి, కార్యాలయ సిబ్బంది శశాంక్, చందు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.