
వాన నీటిని ఒడిసిపట్టేందుకు..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్‌షెడ్ పథకం మంజూరైంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తారు. జిల్లాకు మంజూరైన పిచెర్యాగడి వాటర్‌షెడ్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలను ఎంపిక చేశారు. అత్యంత తక్కువగా భూగర్భ జలాలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించిన ప్రాంతాలను వాటర్‌షెడ్ పథకం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచి కరువును పారద్రోలనున్నారు.
ఈ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాగడి, బడంపేట, పర్శపల్లి, సజ్జాపూర్, కొత్తూర్(కె), ఖానాపూర్, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా వాటర్‌షెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు కావాల్సిన ప్రాజెక్టుకు ఆలస్యంగా 2024లో మంజూరైంది. ఆరు నెలల పాటు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం కింద 4,733 హెక్టార్ల భూమిలో వాటర్‌షెడ్ పనులను చేపట్టేందుకు గుర్తించారు. ప్రాజెక్టు మంజూరైనందున ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో మూడు శాతం మేర పనులు చేశారు. పర్శపల్లిలో 6, సజ్జాపూర్‌లో 3 శాతం మట్టి పర్క్యులేషన్ ట్యాంకుల పనులు కొనసాగుతున్నాయి. వాటర్‌షెడ్ పనుల కోసం 49 శాతం నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో గుట్టలపై మట్టి కట్టలు వేసి వర్షపునీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపడతారు. మిగిలిన నీరు కూడా ఇంకిపోయేందుకు కందకాలను, మట్టి సర్కులేషన్ ట్యాంకులను నిర్మిస్తారు. వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెంచేందుకు వీలుగా వాటర్‌షెడ్ పథకం ఉపయోగపడుతుంది.
రైతులకు అవసరమైన పరికరాలకు నిధులు..
సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించి, ఉత్పాదకత పెంచేందుకు వీలుగా రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు వీలుగా 15 శాతం నిధులను కేటాయిస్తారు. మరో 15 శాతం నిధులతో పేద, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు గ్రామాల్లో ఉన్న సంఘాల ద్వారా అమలు చేస్తారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యవసాయేతర ఉపాధిని ఈ పథకం కింద కల్పిస్తారు.
జిల్లాకు కొత్త వాటర్‌షెడ్ పథకం
పిచెర్యాగడి ప్రాజెక్టు కింద
8 గ్రామాల ఎంపిక
భూగర్భ జలాలు తక్కువగా
ఉన్న గ్రామాలకు చోటు
రూ.10.58 కోట్ల నిధులు మంజూరు
4,733 హెక్టార్లలో పనులు
మూడు శాతం మాత్రమే జరిగిన పనులు

వాన నీటిని ఒడిసిపట్టేందుకు..