
ఫిలిప్స్, సమద్, త్రిపాఠి, అభిషేక్ (PC: SRH Twitter/IPL)
IPL 2023 RR Vs SRH: ‘‘నిమిషాల్లో అంతా తారుమారైంది. ఉత్కంఠ పోరులో విజయం మా వైపు నిలిచింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో జట్టు సమష్టిగా పోరాడింది.
ఊహించనదాని కంటే ఎక్కువే స్కోరు చేస్తామని అనుకున్నాం. అదే నిజమైంది. వాస్తవానికి ముందు నుంచే మేము కాస్త దూకుడు ప్రదర్శించాల్సింది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతోనే గెలుపు వరించిందని సంతోషం వ్యక్తం చేశాడు.
నాడు ఘోర పరాభవం
ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లో ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం మిగిలిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో ఏకంగా 72 పరుగుల భారీ తేడాతో ఓడి ఐపీఎల్ పదహారో ఎడిష్‌ను ఓటమితో ఆరంభించింది. ఈ క్రమంలో ఆదివారం (మే 7) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది.
మరోసారి బట్లర్ విశ్వరూరం
జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్ (18 బంతుల్లో 35 పరుగులు) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 59 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఏకంగా 95 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 పరుగులు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.
అభిషేక్, త్రిపాఠి కలిసి
ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి రాజస్తాన్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55 పరుగులు)కు తోడైన రాహుల్ త్రిపాఠి అతడితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.
అయితే, 13వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన అభిషేక్.. మరోసారి భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరడంతో రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులు సాధించి 16వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు.
ఫిలిప్స్ అద్భుతం చేశాడు.. 6,6,6,4
ఆ తర్వాత కాసేపటికే త్రిపాఠి(29 బంతుల్లో 47 పరుగులు)ని చహల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులో(18వ ఓవర్ మూడో బంతి)కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తొలుత రెండు పరుగులు, ఆ తర్వాత ఒక పరుగు మాత్రమే తీశాడు. ఇంతలోనే మరో ఎండ్‌లో ఉన్న మార్కరమ్(6)ను చహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు.
నో బాల్ వల్ల అదృష్టం
దీంతో రైజర్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6,6,6, 4 బాది మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక ఆఖరి బంతికి హైడ్రామా నెలకొనగా.. సందీప్ శర్మ నోబాల్ కారణంగా రైజర్స్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిందన్న స్టేట్‌మెంట్ నిమిషాల్లో తారుమారైంది. ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్‌లో రైజర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.
వాళ్ల వల్లే గెలిచాం
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ మాకు శుభారంభం అందించాడు. త్రిపాఠి అతడికి తోడుగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఫిలిప్స్, క్లాసీ అద్భుత పాత్ర పోషించారు. సమద్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒత్తిడి పెరిగినపుడు సరైన టెక్నిక్‌ను ఉపయోగిస్తే ఇలాంటి ఫలితం వస్తుంది’’ అని తమ బ్యాటర్ల ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు.
చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్‌కు వదిలేసి మంచి పని చేసింది..!
సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..!
WHAT. A. GAME 😱😱
— IndianPremierLeague (@IPL) May 7, 2023
Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets.
Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz