
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్.. రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా, రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఐపీఎల్ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్న జైస్వాల్.. 62 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ముందు రాయల్స్ తరఫున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు
క్రిస్ గేల్- 48 ఇన్నింగ్స్‌ల్లో
షాన్ మార్ష్- 52
రుతురాజ్ గైక్వాడ్- 57
కేఎల్ రాహుల్- 60
యశస్వి జైస్వాల్- 62
మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకుముందు శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.