
హర్యానాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ (Ranji Trophy Quarter Final) మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్న రహానేకు ఇది 41వ సెంచరీ. రహానే ఈ సెంచరీని 160 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కొద్ది సేపే క్రీజ్‌లో ఉన్న రహానే 108 పరుగుల వద్ద ఔటయ్యాడు.
రహానే సూపర్ సెంచరీ కారణంగా ముంబై హర్యానా ముందు 354 పరుగుల భారీ లక్ష్యాన్ని (తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల లీడ్ కలుపుకుని) ఉంచింది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటైంది. రహానే.. సూర్యకుమార్ యాదవ్‌తో (70) కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు.. శివమ్ దూబేతో (48) కలిసి ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు.
ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (31), సిద్దేశ్ లాడ్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో అనూజ్ థక్రాల్ 4, సుమిత్ కుమార్, అన్షుల్ కంబోజ్, జయంత్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఆరేసిన శార్దూల్
అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.
సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. రహానే (310 మినహా ముంబై టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు.
ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది. హర్యానా బౌలరల్లో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు.. అనూజ్ థాక్రాల్, అజిత్ చహల్, జయంత్ యాదవ్, నిషాంత్ సంధు తలో వికెట్ పడగొట్టారు.