
పాకిస్తాన్‌తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.
మళ్లీ పాత కథే
కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది.
కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్‌టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.
సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్
టాపార్డర్‌లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్‌డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.
ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.
38 బంతుల్లోనే 97 రన్స్
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.
మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్‌మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్