
టీమిండియా రన్‌మెషిన్.. కింగ్ కోహ్లి ఇవాళ(నవంబర్ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 24వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లి ఇప్పటికీ పరుగుల వరదను కొనసాగిస్తూనే ఉన్నాడు. మధ్యలో మూడేళ్ల పాటు సెంచరీ లేకపోయినప్పటికి ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా తనపై వచ్చిన విమర్శలను బ్యాట్‌తోనే తిప్పికొట్టడం అతనికే సాధ్యమైంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్న కోహ్లి జట్టుకు కప్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఇక 2022లో తిరిగి ఫామ్‌ను అందుకున్న కోహ్లి బర్త్‌డే సందర్భంగా 12 ఏళ్ల పాత ట్వీట్ తాజాగా మరోసారి వైరల్ అయింది. 2010 మార్చి 16న కోహ్లి ట్వీట్ చేసే సమయానికి అతను టీమిండియా తరపున కేవలం 23 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 23 మ్యాచ్‌లాడి 847 పరుగులు చేసిన విరాట్ ఖాతాలో అప్పటికి రెండు సెంచరీలు, ఆరు ఫిప్టీలు ఉన్నాయి. ఆ సమయంలో కోహ్లి తన ట్విటర్‌లో ఒక మాట అన్నాడు. ''ఎప్పటికైనా టీమిండియా తరపున వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నా.. ఏదో ఒకరోజు అది నెరవేరుతుంది'' అంటూ రాసుకొచ్చాడు. ఇది పోస్టు చేసిన కొద్ది రోజులకు టి20ల్లో అవకాశం వచ్చింది.
ఆ తర్వాత 2011లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడడంతో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. కట్‌చేస్తే ఇవాళ అన్ని ఫార్మాట్లలో వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 24వేలకు పైగా పరుగులు, 71 సెంచరీలు, 92 అర్థసెంచరీలతో దుమ్మురేపుతున్నాడు.
Looking forward to scoring lots of runs for my Team..
— Virat Kohli (@imVkohli) March 16, 2010