
వైఎస్సార్‌సీపీ ఇళ్లపై టీడీపీ నేతల దాడి
● రేషన్ పంపిణీ విషయమై వివాదం
● ఇళ్లలోని వస్తువులు, సామగ్రి ధ్వంసం
కందుకూరు రూరల్: రేషన్ బియ్యం పంపిణీ విషయమై చెలరేగిన వివాదం దాడులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఓగూరు ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. ఓగూరు ఎస్సీ కాలనీలో ఎండీయూ వాహనంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ ఇద్దరు మహిళలు బియ్యం ఇవ్వాలని వాహనం వద్దకు వెళ్లారు. మీరు గ్రామంలో ఉండడం లేదు. మీకు బియ్యం ఇవ్వం, డబ్బులు మాత్రమే ఇస్తామని అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త పి.రఘు దబాయిస్తూ చెప్పాడు. ఈ విషయాన్ని ఆ మహిళలు వైఎస్సార్‌సీపీ నేత డీ కోటయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాహనం వద్దకు వెళ్లి వారికి బియ్యం ఇవ్వండని అని ఆపరేటర్ రాజాకు చెప్పాడు. అ పక్కనే ఉన్న రఘు అనుచరుడు పీ రవికిరణ్ నువ్వు ఎవడివి రా అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో కోటయ్య తన కారులో బంధువులను రైలు ఎక్కించేందుకు వెళ్తుంగా రఘు, రవికిరణ్ అనుచరులు కొందరు కారును అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ జరుతుండగా కోటయ్యకు కొందరు మద్దతుగా వచ్చి కారును పంపించారు. దీంతో కోటయ్య, ఆయన కుమారుడు కళ్యాణ్ కుమార్ కారులో వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్త రఘు, రవి కిరణ్‌లతోపాటు వారి అనుచరులు వైఎస్సార్‌సీపీకి చెందిన కోటయ్యకు మద్దతుగా వచ్చిన వారి ఇళ్ల మీదకు వెళ్లి ఘర్షణకు దిగి దాడి చేశారు. కోటయ్య కుమారుడు ఇంటి వద్దకు ఉన్న దుకాణంలో సామగ్రిని, ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల్లోని నలుగురికి గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎం.వెంకటేశ్వర్లు, ఎం.వెంకట్రావు గాయపడ్డారు. కందుకూరులో ఉన్న కోటయ్య నివాసానికి టీడీపీ వర్గీయులు వెళ్లారు. సుమారు పది మందికి పైగా బైక్‌లపై వచ్చి సీసీ కెమెరాలు పగులగొట్టి, అసభ్య పదలు తిడుతూ హంగామా సృష్టించి భయాందోళనకు గురి చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడిని నుంచి వెళ్లిపోయారు. కందుకూరు రూరల్ పోలీసులు ఓగూరులో, పట్టణ పోలీసులు కందుకూరులో జరిగిన ఘటను పరిశీలించి ఇరువర్గాలను విచారిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ఇళ్లపై టీడీపీ నేతల దాడి