వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రియల్ బూమ్
● కూటమి ప్రభుత్వం రాకతో
మందగించిన క్రయవిక్రయాలు
● రియల్ వెంచర్లపై అధికార పార్టీ కమీషన్లు
● పెరిగిన ధరలు, అందని సంక్షేమ పథకాలు
● భూముల కొనుగోలుకు
ముందుకురాని క్రయదారులు
● రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
మరో కారణం
● ఐదేళ్లలో 2024–25లోనే అత్యల్పంగా రూ.62.39 శాతం రాబడి
నెల్లూరు సిటీ: రాష్ట్ర రాబడిలో కీలకంగా ఉండే రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్య సాధనలో కుదేలైంది. ప్రభుత్వ పాలనా నిర్ణయాలు భూక్రయవిక్రయాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఆయా రంగాలకు ఆయువు పట్టుగా ఉండే వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం కరువు కావడం, మరో వైపు అన్ని వర్గాల ప్రజలపై జీవన వ్యయభారం పడడంతో స్థిరాస్తి కలలు కల్లలయ్యాయి.
జిల్లాలో 2019 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల వరకు క్రయవిక్రయాలను పరిశీలిస్తే ఏటా ప్రభుత్వ నిర్దేశించే రాబడి లక్ష్యంలో 70 శాతానికి తగ్గలేదు. కరోనా విలయతాండవం చేసిన 2020–21లో లక్ష్యంలో 79.90 శాతం రాబడి లభించింది. కరోనా సెకండ్ వేవ్ 2021–22లో అయితే ఏకంగా 94.67 శాతం రాబడిని ఈ శాఖ ఆర్జించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలోనూ 93.33 శాతం లక్ష్యాన్ని సాధించింది.
గత ప్రభుత్వ పాలన స్వర్ణయుగమే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో రెండేళ్లు కరోనా విపత్తు రాష్ట్ర రాబడిని కుప్పకూల్చేసినా.. మరో వైపు విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రభుత్వ ప్రోత్సాహాలతో వ్యవసాయ రంగం ఉవ్వెత్తున ఎగిసింది. మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు గణనీయమైన ధరలు లభించడంతో ప్రజల రాబడి మరింతగా పెరుగుదలకు కారణమైంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఆయా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహాలు కల్పించడంతో ఉద్యోగ, ఉపాధి మెరుగు పడింది. మరో వైపు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు నాంది పలకడం, విద్య, వైద్యానికి చేయూతగా నిలబడడంతో ప్రజల జీవన వ్యయాలు తగ్గడంతో రాబడులు పెరగడం వంటి పరిణామాలు స్థిరాస్తి కొనుగోళ్లను ప్రభావితం చేశాయి.
ఐదేళ్లు కళకళలాడిన రిజిస్ట్రార్ కార్యాలయాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఊరూరా ప్రైవేట్ లేఅవుట్లను తలపించే రీతిలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటికి సమాంతరంగా సమీపంలో కొత్తగా వెంచర్లు, హై అండ్ లో ప్రొఫైల్ స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి. క్రయవిక్రయాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిత్యం కళకళలాడుతుండేవి.
కూటమి పాలనలో..
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు అమాంతంగా పడిపోయాయి. స్థానికంగా కూటమి నేతల నుంచి ఎమ్మెల్యేల స్థాయి వరకు రియల్ వెంచర్లపై రాబందుల్లా పడ్డారు. ఎకరాకు ఇంత వాటా ఇవ్వాలంటూ ఒత్తిళ్లు పెంచారు. తమ ప్రత్యర్థుల వెంచర్లు అయితే ఏకంగా సరైన అనుమతులు లేవంటూ ధ్వంసం చేశారు. గతంలో ఎప్పుడో కొనుగోలు చేసిన కట్టుకున్న ఇళ్లకు బెటర్‌మెంట్ కట్టాలంటూ నోటీసులు జారీ చేయించారు. అనేక వెంచర్లపై లోకాయుక్త వంటి న్యాయస్థానాల్లో ఫిర్యాదులు చేయించడానికి తెగించారు. మొత్తం మీద రెడ్‌బుక్ రాజ్యాంగం నడపడంతో భూములను అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేక రియల్ ఎస్టేట్ కుదేలైంది. ఇది చాలదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచింది. ఈ క్రమంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో అత్యల్పంగా కేవలం 62.39 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో మొత్తం 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి రోజూ జిల్లాలో కనీసం 150 నుంచి 350కి పైగా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. నెల్లూరులోని ఆర్‌ఓ కార్యాలయంలో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. జాతీయ రహదారి కనెక్టివిటీలోని కావలి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, బుజబుజనెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. క్రయ, విక్రయాలు లేక రియల్టర్‌లు తలలు పట్టుకుంటున్నారు.
అల్లీపురం లేఅవుట్‌లో విక్రయానికి నోచుకోని ఇళ్లు
ఆర్థిక సంవత్సరం లక్ష్యం సాధించింది శాతం రిజిస్ట్రేషన్లు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
2019–20 30,007.48 22,213.20 74.03 62,930
2020–21 29,117.31 23,264.65 79.90 65,036
2021–22 35,664.17 33,761.57 94.67 1,18,787
2022–23 46,674.58 43,561.62 93.33 1,42,348
2023–24 66,975.63 48,034.65 71.72 1,88,229
2024–25 71,238.22 44,448.25 62.39 93,772
అటు లేవుట్‌ల్లో ప్లాట్లు.. ఇటు నిర్మించిన ఇళ్లు
జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నుంచి రియల్టర్లు లేఅవుట్‌లు వేశారు. బిల్డర్లు ఆయా లేవుట్లలో అన్ని సదుపాయాలతో ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయా లేఅవుట్లలో భూములు కొనేవారు లేక రియల్ ఎస్టేట్ పడిపోయింది. రూ.కోట్లు ఖర్చు చేసి ఇళ్ల నిర్మాణాలు చేసినా కొనుగోలు లేక గత 9 నెలల నుంచి ఖాళీగా పెట్టుకున్నారు. కొందరు బిల్డర్లు నూతనంగా నిర్మించిన ఇళ్లను విక్రయించలేక బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు చెల్లించాల్సి రావడంతో లబోదిబోమంటున్నారు.
2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రిజిస్ట్రేషన్ల వివరాలు
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోయింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని అటకెక్కించింది. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడంతో ఉద్యోగ, ఉపాధి రంగాలు కుదేలయ్యాయి. ధరల పెరుగుదల కట్టడిలో విఫలం కావడం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ క్షీణించడం, వ్యాపార వృద్ధి పాతాళానికి పడిపోవడం వంటి కారణాలతో రాబడి కొరవడింది. మరో వైపు స్థానిక లీడర్ల నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు రియల్ వెంచర్లకు ముడుపుల టార్గెట్లు విధించడంతోపాటు తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.
స్థలాలు కొనేవారు తగ్గారు
నెల్లూరులో స్థలాలు అమ్మేవారు ఉన్నా, కొనేవారు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. గతంలోని ధరలకు విక్రయించలేక, ధరలను తగ్గించుకోలేక భూ యజమానులు నిరీక్షిస్తున్నారు.
– సాజిద్, కోవూరు
ధరలు తగ్గుతాయని వేచి చూస్తున్నా
ఇల్లు కొనాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లేకపోవడంతో మళ్లీ కొందామని వేచి చూస్తున్నాను. ధరలు ఇంకా తగ్గుతాయని అనుకుంటున్నాను.
– అమర్‌నాథ్ సింగ్, స్టౌన్‌హౌస్‌పేట
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రియల్ బూమ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రియల్ బూమ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రియల్ బూమ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రియల్ బూమ్


