● హైకోర్టులో రిట్ పిటిషన్
నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రోగ్రెస్ కార్డును, ఓటు హక్కు వినియోగించుకుంటే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు విజయమహల్ గేట్ సమీపంలోని వెంకటరామపురానికి చెందిన అలహరి వెంకటేశ్వర్లు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ తదితర 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. యాప్‌లో ఓటర్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేస్తే ఓటు వేసి ఉంటే ఫొటో డిస్‌ప్లే అయ్యేలా చూడాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచే మద్యాన్ని నిషేధించాలన్నారు. ఓటు హక్కు గురించి అవగాహన కల్పిస్తూ హైస్కూ ల్ స్థాయిలోనే పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.
మిద్దైపె నుంచి పడి
వ్యక్తి మృతి
సీతారామపురం: మండలంలోని గంగవరం గ్రామంలో చిన్న ఓబయ్య (48) అనే వ్యక్తి మిద్దైపె నుంచి కింద పడి మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రాత్రి ఓబయ్య నిద్రపోవడానికి మిద్దైపెకి వెళ్లాడు. మంగళవారం వేకువజామున మూత్రవిసర్జనకు వెళ్తూ ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కింద పడి చనిపోయాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
యువతి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లిదండ్రులు మందలించడంతో యువతి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కిసాన్ నగర్‌లో సురేష్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. అతడి కుమార్తె నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఎక్కువగా ఫోన్ చూస్తుండటంతో ఇటీవల తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లోంచి వెళ్లిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు గాలించారు. జాడ తెలియకపోవడంతో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా తెలిపారు.
పాముకాటుకు
వార్డు మెంబర్ బలి
మనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ వెంకటరమణమ్మ (40) పాముకాటుతో మంగళవారం మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు.. కొమ్మలపూడి పంచాయతీ 7వ వార్డు మెంబర్ వెంకటరమణమ్మ తన భర్త ఆదిశేషయ్యతో కలిసి పొలం పనులకు వెళ్లింది. గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు లోనైన వెంకటరమణమ్మను చికిత్స నిమిత్తం బంధువులు నెల్లూరుకు తరలిస్తుండగా దారిలో మరణించింది. రమణమ్మ మృతితో దళితవాడలో విషాదం నెలకొంది. రమణమ్మకు కుమార్తె ప్రతిమ, కుమారుడు సతీష్ ఉన్నారు.