
పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో పురోగతి, క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం మొదలైన అంశాలను పరిశ్రమల శాఖ జీఎం ప్రసాద్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువు కంటే ముందుగా అనుమతి ఇవ్వాలన్నారు. ప్రింటింగ్, రెడీమేడ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అధికారులు మహబూబ్‌బాషా, వెంకటరమణ, గంగాభవాని, అశోక్ కుమార్, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, ఒమ్మిన సతీష్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంజాయి విక్రయాలపై
పోలీసుల దాడులు
● అదుపులో ఐదుగురు వ్యక్తులు
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయాలపై నెల్లూరు సంతపేట పోలీసులు దాడులు చేసి ఐదుగురు విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అధిక శాతం నేరాలు మత్తులో జరుగుతుండటంతో నగర పోలీస్ అధికారులు దీనిపై దృష్టి సారించారు. పొర్లుకట్ట పెన్నానది సమీపంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయని మంగళవారం సంతపేట పోలీసులకు పక్కా సమాచారం అందింది. వారు వెంటనే అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన ఐదుగురు విక్రేతలు పరారవుతుండగా వెంబడించి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు భగత్‌సింగ్ కాలనీ టిడ్కో గృహ సముదాయంలో ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించేందుకు ఎస్పీ జి.కృష్ణకాంత్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. మంగళవారం నగర డీఎీస్పీ పి.సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి టిడ్కో ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇంటి యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వాహన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నలుగురు పాతనేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహణ ముఖ్య ఉద్దేశాన్ని డీఎస్పీ స్థానికులకు తెలియజేశారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర ఇన్‌స్పెక్టర్లు కె.సాంబశివరావు, జి.దశరథరామారావు, రోశయ్య, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు