
● వ్యాపారాన్ని ఆధీనంలోకి తీసుకున్న అధికార పార్టీ నేతలు
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో పాత, కొత్త వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం తమదేనంటూ అధికార పార్టీ నాయకులు బియ్యం వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. దానిని దెబ్బతీసేందుకు కొందరు పాత వ్యాపారులు ప్రయత్ని ంచి భంగపడుతున్నారు. ప్రస్తుతం
కందుకూరు నియోజకవర్గంలో బియ్యం వ్యాపారుల మధ్య జరుగుతున్న పోరు చర్చనీయాంశంగా మారింది.
కందుకూరు: లింగసముద్రం మండలం పెదపవని గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని అధికార పార్టీ నాయకులు భారీగా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ప్రతి నెలా రేషన్ డీలర్ల దగ్గర సేకరించిన బియ్యాన్ని నేరుగా గ్రామంలోని మిల్లుకు తరలించి అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టు, చైన్నె ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. ఇందుకోసం నియోజకవర్గంలో మండలానికి ఒక నాయకుడిని నియమించారు. అక్కడ బియ్యం వ్యాపారం మొత్తం వీరి కనుసన్నల్లోనే జరిగేలా అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయకుండానే నేరుగా బ్లాక్‌మార్కెట్‌కు తరలించేస్తున్నారు. డీలర్లు ఒక కేజీని రూ.12 లెక్కన జనాల వద్ద కొనుగోలు చేస్తారు. తర్వాత వాటిని రూ.16 లెక్కన డీలర్ల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు పంపుతారు. వందల టన్నుల బియ్యాన్ని అసలు రేషన్ షాపులకు చేర్చకుండానే సివిల్ సప్లయ్స్ గోదాము నుంచి నేరుగా తరలిస్తున్నారు. నెలలో కనీసం 18వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. ఒకటి, రెండు తేదీల్లోనే సరుకుని తరలించిన అనంతరం లబ్ధిదారుల వద్ద వేలిముద్రలు తీసుకుని డబ్బులిచ్చి పంపుతున్నారు. ఈ ప్రక్రియలో బియ్యం వ్యాపారం చూస్తున్న అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగానే డీలర్లు వ్యవహరించాలి. వారికి తప్ప బియ్యాన్ని మరొకరికి అమ్మడానికి వీల్లేదు. దీంతో దశాబ్దాల తరబడి ఇదే వ్యాపారం చేస్తున్న బియ్యం వ్యాపారుల ఆదాయానికి గండి పడింది.
పోలీసుల వేధింపులు
తమను వ్యాపారం చేసుకోనివ్వడం లేదంటూ పాత వ్యాపారులు ఒక జట్టుగా ఏర్పడ్డారు. అధికార పార్టీకి చెందిన నేతల వ్యాపారాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారు బియ్యం నిల్వ చేసే స్థావరాలపై, రవాణా చేసే వాహనాలపై నిఘా ఉంచి అధికారులకు సమాచారం ఇవ్వడం ప్రారంభించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని, మిల్లులో భారీ ఎత్తున నిల్వ చేసి ఉన్నారని అధికారులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల పెదపవని కేంద్రంగా నడుస్తున్న మిల్లుపై నిఘా ఉంచి జిల్లా ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్థానిక అధికారుల వరకు ఫోన్లు చేశారు. అయితే దాడులు చేసేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. అధికార పార్టీకి చెందిన వ్యవహారం కావడంతో వెనుకంజ వేస్తున్నారు. పైగా కొందరు ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది బియ్యం వ్యాపారులకు తెలియజేస్తున్నారు. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు నేతలు చర్యలు ప్రారంభించారు. పోలీసులను రంగంలోకి పాత వ్యాపారులు బియ్యం తరలించే వాహనాలను పట్టుకోవడం, కేసులు నమోదు చేయించడం, వారిని స్టేషన్‌కు పిలిపించి వేధించడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల ఉలవపాడు స్టేషన్‌లో చోటు చేసుకున్న ఉదంతమే ఇందుకు నిదర్శనం. సింగరాయకొండకు చెందిన ఒకతను కందుకూరు ప్రాంతంలో బియ్యం కొని వ్యాపారం చేస్తుంటాడు. ఈ వాహనాన్ని పట్టుకున్న ఉలవపాడు పోలీసులు అతడిపై వేధింపులకు దిగారు. పాత కేసులను ఆసరాగా చేసుకుని సస్పెక్ట్ షీట్‌ను కూడా తెరిచారు. అలాగే లింగముద్రం మండలం వీఆర్ కోటకు చెందిన మరో వ్యాపారిపై కూడా గుడ్లూరు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న బియ్యం వ్యాపారానికి అడ్డు తగులుతుండటమే వీరిపై వేధింపులకు కారణం. దీంతో కొందరు వ్యాపారం మానుకోగా, మరికొందరు అధికార పార్టీ వ్యాపారులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.
చర్యలు లేకపోవడంతో..
సాధారణంగా ప్రతినెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా నెల మొదటి వారంలోనే రేషన్‌షాపుల నుంచి బియ్యం మొత్తం బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తోంది. ఇటీవల ఇలాంటి ఘటన పట్టణంలోని ఉప్పుచెరువు రోడ్డులో సబ్‌కలెక్టర్ సాక్షిగా వెలుగు చూసినా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. దీంతో తమ ఇష్టారాజ్యంగా బియ్యాన్ని తరలించేస్తున్నారు.
నియోజకవర్గంలో ఎవరూ
ఆ బిజినెస్ చేయరాదంటూ హుకుం
ఎదురు తిరుగుతున్న పాత వ్యాపారులు
గుట్టు రట్టు చేసేందుకు
జట్టు కట్టిన వైనం
అడ్డు తగులుతున్న వారిపై కేసులతో వేధింపులు

● వ్యాపారాన్ని ఆధీనంలోకి తీసుకున్న అధికార పార్టీ నేతలు