
చంపేస్తాడన్న భయంతోనే..
● సుల్తాన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): పెన్నా నది వద్ద జరిగిన సుల్తాన్ హత్య కేసులో నిందితులను నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగర డీఎస్పీ పి.సింధుప్రియ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్ సుల్తాన్ (38) బేల్దారి పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసైన అతను పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలువురిని బెదిరించి నగదు దోచుకుని మద్యం తాగేవాడు. సుల్తాన్ హత్యపై బాధిత తల్లి కరిమున్నీసా ఫిర్యాదు మేరకు నవాబుపేట ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ కె.సాంబశివరావు నేతృత్వంలో ఎస్సైలు రెహమాన్, శివయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను జాకీర్‌హుస్సేన్ నగర్ న్యూకాలనీకి చెందిన షేక్ సలీం అలియాస్ కలీమ్, మైపాడు రోడ్డు సింహపురి కాలనీకి చెందిన ఎం.నాగరాజుగా గుర్తించారు. మంగళవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈనెల 16వ తేదీన మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సలీంను సుల్తాన్ అడగ్గా అతను లేవని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన సుల్తాన్ డబ్బులివ్వకుండా ఎలా బతుకుతావో చూస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన సలీం ఈ విషయాన్ని తన స్నేహితుడైన నాగరాజుకు తెలియజేశాడు. సుల్తాన్ చంపేందుకు వస్తే ఇద్దరం కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి సలీం, నాగరాజు న్యూకాలనీ సమీప పెన్నా నది వద్ద ఉండగా సుల్తాన్ వెళ్లి గొడవపడి దాడి చేశాడు. వారు కర్రలతో సుల్తాన్ తలపై కొట్టగా మృతిచెందాడు. నిందితులను అరెస్ట్ చేసిన ఏఎస్సై బీవీ నరసయ్య, హెచ్‌సీ ఎస్.ప్రసాద్, కానిస్టేబుళ్లు ఆర్వీ రత్నయ్య, సురేంద్రబాబు, గౌస్, మస్తానయ్య, వేణును డీఎస్పీ అభినందించారు.