
ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
● రాష్ట్ర సాల్ట్ సొసైటీ అసోసియేషన్
అధ్యక్షుడు బాలకృష్ణరాజు
కావలి: జిల్లాలో ఉప్పు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర సాల్ట్ సొసైటీ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరాజు బాలకృష్ణరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఉప్పు సాగు చేసే రైతులకు భూమిపై హక్కు లేదని, ప్రభుత్వ భూమి కావడంతో బ్యాంక్ రుణాలు మంజూరు కావడం లేదని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులు వద్ద అప్పు దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2008లో అల్లూరు ఎమ్మెల్యేగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నప్పుడు సీఎం వైఎస్సార్‌ను కలిసి ఉప్పు రైతుల కష్టాలను తెలియజేసినట్లు చెప్పారు. ఆయన స్పందించి విద్యుత్ యూనిట్ రూ.4ను రూ.1కే ఇస్తానని చెప్పారన్నారు. తాము అడిగిన నాటికి మూడు నెలల ముందు నుంచే యూనిట్ రూ.1కే అందించేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దీనిని రద్దు చేయడంతో మళ్లీ రైతులు విలవిల్లాడిపోయారన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉప్పు భూములకు పట్టాలివ్వాలని, రవాణా వసతులు, తాగునీటి వసతులు కల్పించాలని రైతులు కోరారన్నారు. రైతులు, కూలీలు సుమారు 10,000 మందికి పైగా ఉప్పు సాగుపై ఆధారపడి బతుకుతున్నారని తెలియజేశారు. అధికారంలోకి రాగానే అవసరమైన చర్యలు తీసుకుని మేలు చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. అయితే నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఉప్పును భద్రపరుచుకోవడానికి వసతుల్లేవని చెప్పారు. అసలు ధర ఎంత అనేది రైతులకు తెలికపోవడంతో వ్యాపారులు, దళారులు ఎంత ధర చెబితే అంతకే అమ్మకాలు చేస్తున్నారన్నారు. బీమా సౌకర్యం కల్పిస్తే వర్షమొస్తే రైతులకు నష్టశాతం కొంత వరకై నా తగ్గుతుందన్నారు. ఒక్క అల్లూరు మండలంలోని గోగులపల్లి, ఇస్కపల్లి గ్రామాల్లోనే 5,000 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి లోకేశ్ మాటను నిలుపుకొని అండగా ఉండాలని కోరారు.