
జిల్లా జడ్జి యామిని బదిలీ
నెల్లూరు (లీగల్): నెల్లూరు జిల్లా జడ్జి సి.యామిని వైఎస్సార్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అనంతపురం జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. నెల్లూరు ఆరో అదనపు జిల్లా (ఫ్యామిలీ కోర్టు) జడ్జి వెంకట నాగపవన్ గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆరో అదనపు జిల్లా జడ్జి నిఖిత ఆర్‌ఓరా నియమించారు. నెల్లూరు జిల్లా గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి షమీ పర్వీన్ సుల్తానాబేగంను గుంటూరు జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ జడ్జిగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది జిల్లా జడ్జిలు, అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్మికులకు పీఎం
జన ఆరోగ్య యోజన
నెల్లూరు (పొగతోట): అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద పేర్లు నమోదు చేసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించబోయే ఆరోగ్య, సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. పేర్ల నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాలను కార్మికులందరూ ఉపయోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94925 55114, 94925 55126 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఉద్యోగ నియామక
పత్రాలు అందజేత
నెల్లూరు రూరల్: విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ ఆనంద్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2022–23 సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా అంధులు, బధిరులు, శారీరక వైకల్యం ఉన్న వారిని ఎంపిక చేసి లైబ్రరీ అసిస్టెంట్, టెక్నికల్ విభాగంలో టైపిస్ట్, కామాటి, ఫిట్టర్, కూలి, పీహెచ్ వర్కర్ తదితర ఆరు పోస్టులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సహాయ సంచాలకులు మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు.
కోవూరు షుగర్స్ సమస్యకు
పరిష్కార చర్యలు ●
● ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
నెల్లూరు రూరల్: కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో చక్కెర కర్మాగారం రైతులు, కార్మికులు, షేర్ హోల్డర్లతో కలెక్టర్ ఆనంద్‌తో కలిసి ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ కార్మికులకు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి సుమారు 124 ఎకరాల భూములను ఏపీఐఐసీకి అప్పగించి పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా 10 వేల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 30 వేల ఉద్యోగాలు మొత్తం సుమారు 40 వేల వరకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ విషయమై రైతులు, కార్మికులు చర్చించుకుని తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. కార్మికులు తమకు చెల్లించాల్సిన రూ.24 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని విన్నవించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ షుగర్ కేన్ జాన్ విక్టర్, రైతు సంఘాల నాయకుడు శ్రీనివాసులు టీవీవీ ప్రసాద్, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు నారాయణ, షేర్ హోల్డర్లు, పలువురు రైతులు కార్మికులు పాల్గొన్నారు.

జిల్లా జడ్జి యామిని బదిలీ

జిల్లా జడ్జి యామిని బదిలీ