
బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం అర్బన్: బాలల సంక్షేమం, రక్షణ విషయంలో గ్రామ, వార్డు సంక్షేమ, రక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తల్లిపాలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం బాలల హక్కుల మిషన్ వాత్సల్య సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. తరచూ శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. బాల కార్మికుల భిక్షాటన, బాల్య వివాహాల నిర్మూలన, దివ్యాంగ పిల్లలకు చేయూత, బాలల హక్కుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి కె.వి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు.