Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Congress in Telangana Holds Candlelight Rally Against Pahalgam Terror Attack1
పాక్‌ను ముక్కలు చేయండి

సాక్షి, హైదరాబాద్‌: ‘మోదీజీ.. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను భారత్‌లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీటైన జవాబు ఇచ్చారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కఠినంగా వ్యవహరించాలి.. ‘పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ మద్దతు పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.‘ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుతున్నాం. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం’అని రేవంత్‌ అన్నారు. ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ అని రెండు ముక్కలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయ్‌ దుర్గామాతతో పోల్చారని పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీరు దుర్గామాత భక్తులు. ఇందిరను ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు. కొవ్వొత్తుల ప్రదర్శన...పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మాజీ ఎంపీలు అజహరుద్దీన్, సల్మాన్‌ ఖుర్షీద్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, సలహాదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని ప్రారి్థంచారు. భారత్‌ సమ్మిట్‌–2025 అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్‌ విచ్చేసిన ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని భారత్‌ మాతాకి జై అంటూ ముందుకు సాగారు.

Sunrisers Hyderabad beat CSK by 5 wickets2
గెలిచి నిలిచిన రైజర్స్‌

చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్‌తో సూపర్‌ కింగ్స్‌ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్‌ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్‌కు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్‌ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్‌కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్‌ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్‌ 5 వికెట్లతో సీఎస్‌కేపై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఆయుశ్‌ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్షల్‌ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్రెవిస్‌ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (0) అవుట్‌ కావడంతో చెన్నై ఇన్నింగ్స్‌ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్‌ తరహాలో ఆయుశ్‌ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్‌ కరన్‌ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్‌ కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షల్‌ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్‌ చేయగా... సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న బ్రెవిస్‌ మాత్రం కమిందు బౌలింగ్‌లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్‌ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్‌ బాదిన బ్రెవిస్‌ తర్వాతి బంతికి కమిందు మెండిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. శివమ్‌ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన అన్షుల్‌ కంబోజ్‌ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్‌ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్‌ కిషన్‌... ఛేదనలో సన్‌రైజర్స్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్‌ శర్మ (0) అవుట్‌ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్‌ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ (7) విఫలం కావడంతో రైజర్స్‌ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్‌ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్‌ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్‌ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) అభిషేక్‌ (బి) షమీ 0; ఆయుశ్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) కమిన్స్‌ 30; స్యామ్‌ కరన్‌ (సి) అనికేత్‌ (బి) హర్షల్‌ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్‌ (సి) కమిందు (బి) హర్షల్‌ 42; శివమ్‌ దూబే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 12; హుడా (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 22; ధోని (సి) అభిషేక్‌ (బి) హర్షల్‌ 6; అన్షుల్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 2; నూర్‌ (సి) షమీ (బి) హర్షల్‌ 2; ఖలీల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్‌: షమీ 3–0–28–1, కమిన్స్‌ 4–0–21–2, ఉనాద్కట్‌ 2.5–0–21–2, హర్షల్‌ పటేల్‌ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్‌ 3–0–26–1. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) ఆయుశ్‌ (బి) ఖలీల్‌ 0; హెడ్‌ (బి) కంబోజ్‌ 19; ఇషాన్‌ కిషన్‌ (సి) కరన్‌ (బి) నూర్‌ 44; క్లాసెన్‌ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్‌ (సి) హుడా (బి) నూర్‌ 19; కమిందు (నాటౌట్‌) 32; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–21–1, కంబోజ్‌ 3–0–16–1, నూర్‌ అహ్మద్‌ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్‌ కరన్‌ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X పంజాబ్‌ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Rasi Phalalu: Daily Horoscope On 26-04-2025 In Telugu3
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి ప.1.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ఉ.8.06 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.12.02 నుండి 1.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృతఘడియలు: రా.9.30 నుండి 11.01 వరకు.సూర్యోదయం : 5.41సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.3.00 నుండి 3.00 వరకు మాస శివరాత్రి. మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త చిక్కులు.వృషభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.సింహం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.తుల: గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు.ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.మకరం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. పనుల్లో మరింత పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.మీనం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు.

European Union fines Apple and Meta4
కార్పొరేట్‌ సంస్థలకు కళ్లెం

ప్రభుత్వాల హవా తగ్గి కార్పొరేట్లు, గుప్పెడుమంది వ్యక్తులు రాజ్యాన్ని శాసించే స్థితి ప్రపంచమంతటా వచ్చి చాన్నాళ్లవుతోంది. ఇలాంటి స్థితిలో డిజిటల్‌ మార్కెటింగ్‌ చట్టం (డీఎంఏ) ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికన్‌ బడా టెక్‌ సంస్థలు యాపిల్, మెటా (ఫేస్‌బుక్‌)లకు భారీయెత్తున జరిమానా విధించి యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కొంత సాహసాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. యాపిల్‌ సంస్థకు 57 కోట్ల డాలర్లు (రూ. 4,868 కోట్లుపైగా), మెటా సంస్థకు దాదాపు 23 కోట్ల డాలర్లు (రూ. 1,965 కోట్లు) ఈయూ పెనాల్టీ విధించింది. వచ్చే జూన్‌ చివరికల్లా యాపిల్‌ ఈయూ నిబంధనలకు భిన్నంగావున్న తన యాప్‌ స్టోర్‌ నిబంధనల్లో సవరణలు చేయకపోతే రోజువారీ జరిమానాలు మొదలవుతాయి. మెటా సంస్థ నిరుడు ఈయూ నోటీసు అందుకున్నాక దారికొచ్చి యాప్‌ స్టోర్‌లో మార్పులు తెచ్చింది. అందువల్ల పాత తప్పులకు మాత్రమే జరిమానా పడింది. ఈయూ తమపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని ఆ రెండు సంస్థలూ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ రెండు సంస్థలకు విధించిన జరిమానాలూ చాలా తక్కువన్న అభిప్రాయం యూరప్‌ ప్రజల్లోవుంది. మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నిరుడు యాపిల్‌ సంస్థకు 205 కోట్ల డాలర్ల (రూ. 17,500 కోట్లపైమాటే), మెటా సంస్థకు 90 కోట్ల డాలర్ల (రూ. 7,685 కోట్లకుపైగా) జరిమానాలు విధిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఏడాదిగా ఆ సంస్థల వివరణను పరిశీలించే పేరిట తాత్సారం చేసి చివరకు తుది తీర్పు ప్రకటించింది. ఆ సంస్థలు మాత్రం ఇది కూడా అన్యాయమేనన్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నాయి.వర్తమాన పరిస్థితుల్లో ఈయూ ఈ స్థాయి జరిమానాలు విధించటం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్‌ అధిష్ఠించాక లెక్కలు మారిపోయాయి. సర్వరోగ నివారిణిగా ఆయన అధిక సుంకాల మోతమోగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికన్‌ టెక్‌ కంపెనీల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తామంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన కృత్రిమ మేధ సదస్సు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈయూపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. ఏఐ ప్రగతిని అడ్డుకునేలా యూరప్‌ వ్యవహ రిస్తున్నదని, అమెరికా బడా సంస్థలను అతిగా నియంత్రించే పోకడలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ప్రత్యేకించి డీఎంఏ, డిజిటల్‌ సర్వీసెస్‌ చట్టం (డీఎస్‌ఏ)లను ప్రస్తావించారు కూడా. జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (జీడీపీఆర్‌) సైతం తమకు సమ్మతం కాదని తెలిపారు. యూరప్‌ దేశాల్లో నిబంధనలు తమ వ్యాపార విస్తరణకూ, లాభార్జనకూ ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నట్టు వాన్స్‌ వివరించారు. ఈ పోకడల్ని సహించబోమన్నారు. ఇదంతా గుర్తుంచుకుంటే ఈయూ తాజా నిర్ణయంలోని ఆంతర్యమేమిటో బోధపడుతుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఏటా కోట్లాది డాలర్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్న తమ బడా సంస్థలంటే అమెరికాకు అభిమానంవుండొచ్చు. కానీ ఆ సంస్థలు రకరకాల నిబంధనల పేరిట సాధారణ వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా, దివాలా తీయిస్తున్నా వేరే దేశాల వారెవరూ మాట్లాడకూడదని ట్రంప్, వాన్స్‌ భావించటం తెంపరితనం తప్ప మరోటి కాదు. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో లభించే మ్యూజిక్‌ యాప్‌ తదితరాలపై అధికంగా వసూలు చేస్తున్నారని భావించే వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేయొచ్చని చెప్పే డెవలపర్ల సందేశం కనబడకుండా, ఆ యాప్‌కు నేరుగా తీసుకెళ్లే లింక్‌లు పనిచేయకుండా యాపిల్‌ నిరోధిస్తున్నది. ఇక మెటా అయితే తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభ్యమయ్యే యాప్‌లు కావాలంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉపయోగించుకోవటానికి అనుమతించాలని షరతు విధిస్తోంది. అంగీకరించనివారికి ఆ యాప్‌లలో వాణిజ్య ప్రకటనలు కనబడేలా చేస్తోంది. అవి వద్దనుకుంటే నెలవారీ ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. సాంకేతికతలు ఎంతగానో విస్తరించిన ఈ తరుణంలో బడా కార్పొరేట్‌ సంస్థలు వాటిపై ఆధారపడకతప్పని స్థితి జనాలకు కల్పించి చెల్లిస్తారా... చస్తారా అన్నట్టు పీక్కుతింటున్నాయి. ఈ స్థితిలో కీలెరిగి వాతపెట్టిన చందాన డీఎంఏ రంగప్రవేశం చేసింది. టెక్‌ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడితే ఆ సంస్థల ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం, పదే పదే ఆ తప్పులు చేస్తూ పోతే ప్రపంచ టర్నోవర్‌లో 20 శాతం మేర జరిమానాలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలకు వాతలుపెట్టి అనవసరంగా ట్రంప్‌ ఆగ్రహాన్ని చవిచూడటమెందుకని ఈయూ జంకుతున్న వైనం తాజా నిర్ణయంలో స్పష్టంగా కనబడుతోంది. వాటిపై చర్య తీసుకుంటున్నామన్న అభిప్రాయం యూరప్‌ ప్రజల్లో కలగాలి... అదే సమయంలో ట్రంప్‌ చేత చీవాట్లు తినకుండా, ఆయనగారిని మరీ నొప్పించకుండా గండాన్ని గట్టెక్కాలి అని ఈయూ భావిస్తోంది. అయితే మనకన్నా ఈయూ ఎంతో నయం. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులను అరికట్టడానికున్న కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కఠినంగా ఉండలేకపోతున్నది. గూగుల్‌ సంస్థ పోకడలను అరికట్టడంలో ఎంతో కొంత విజయం సాధించినా అది చాలినంతగా లేదు. వినియోగదారులూ, స్థానిక పరిశ్రమలూ నిలువుదోపిడీకి గురికాకుండా... టెక్‌ సంస్థలైనా, మరే ఇతర సంస్థలైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు కావలసిన చట్టాలు తీసుకురావాలి. అనారోగ్యకర వ్యాపార పోకడలపై కఠినచర్యలుండాలి. బడా కార్పొరేట్‌ సంస్థలు తమ లాభాలను అపారంగా పెంచుకోవటం, అవి ప్రభుత్వాల్ని శాసించే స్థితికి ఎదగటం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఈయూ చర్యల్ని స్వాగతించాలి.

Pakistan airspace closure to hit Indian carriers as flight durations5
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం

పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్‌ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్‌ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్‌ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్‌ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్‌ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్‌ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్‌ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్‌ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్‌ చెప్పారు. ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ఒకరు తెలిపారు. కనెక్టింగ్‌ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్‌ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్‌ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్‌ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్‌ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్‌ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్‌ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్‌ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్‌ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్‌ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్‌ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్‌డేట్స్‌ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను తరచూ చెక్‌ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్‌ ఉండాలి. → ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Construction costs of five iconic towers have skyrocketed6
అవినీతి 'ఐకానిక్‌'!

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్‌ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్‌ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్‌ టవర్ల టెండర్లలో భారీ గోల్‌మాల్‌ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్‌లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్‌ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్‌ (నిలువు కాంక్రీట్‌ దిమ్మెలు), బీమ్స్‌ (అడ్డు కాంక్రీట్‌ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్‌ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేస్తారు. ఐకానిక్‌ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ డిజైన్‌ చేసింది. డయాగ్రిడ్‌ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్‌ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్‌ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్‌ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్‌డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్‌ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్‌ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్‌ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికార­వర్గాలు వ్యాఖ్యాని­స్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధా­రాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చే­తులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యా­యి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీ­షన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పు­డు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌– జెనిసిస్‌ ప్లానర్స్‌–డిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్‌డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాల­యాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించను­న్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు అప్పగించింది.

Now there are four nominees for the bank account7
ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!

సాక్షి, అమరావతి: బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. ఆరి్థక ఆస్తుల నిర్వహణలో పారదర్శత తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్‌ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఖాతా దారులకు రెండు ఆప్షన్లునలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్‌లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణా­నంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్‌లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్‌) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.గతంలో ఒక్క నామినీకే అవకాశం గతంలో బ్యాంక్‌ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతోపాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్‌ చేయకపోవడం వల్ల డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎవేర్‌నెస్‌ ఫండ్‌కి అవి జమ అయిపోతున్నాయి.

India forms 3-step plan on Indus water to stop flow to Pakistan8
జలదిగ్బంధం! 

దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్‌ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్‌ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్‌ బేసిన్‌లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్‌ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్‌ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్‌ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్‌ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్‌ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్‌ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్‌ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్‌ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్‌ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్‌ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Highest temperatures likely to be recorded this summer9
కాసింత నీడ.. కాస్తంత నీరు..!

సాక్షి, అమరావతి: ఈ వేసవిలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేలో 47 వరకూ వెళ్లే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనేందుకు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కనపడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వేడిగాలులు పెరిగాయి. డీహైడ్రేషన్, హీట్‌ ఎగ్జాష్టన్, హీట్‌ స్ట్రోక్‌ వంటి ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయి. ప్రభుత్వ తక్షణ దృష్టి అవశ్యం తీవ్ర ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచే దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవా­లి. భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో జిల్లాల వారీగా హీట్‌ అలర్ట్స్‌ మరింత కచ్చితత్వంతో జారీ చేయాలి. అన్ని వర్గాలకు ఈ హెచ్చరికలు చేరేలా చూడాలి. బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూల్‌ రూఫ్‌ బస్టాండ్‌లు, షెడ్‌లను శాశ్వతంగా నిర్మించడం మంచిది. ఆసుపత్రుల్లో హీట్‌ స్ట్రోక్‌ యూనిట్లు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎమ­ర్జెన్సీ బెడ్లు సిద్ధం చేయాలి. ఇక బడుల సమయాల్లో మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉండకుండా చూడాలి. బయట తరగతులు నిర్వహించకూడదు. హీట్‌ అలర్ట్‌ వచి్చనపుడు సెలవులు ప్రకటించాలి. ప్రజా రవాణా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు» బయటకి వెళ్లే సమయాన్ని తగ్గించుకోవాలి. » మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. » తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సివస్తే తలపై టోపీ, తెల్లని దుస్తులు ధరించాలి. » రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు నీటిని తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. » ఆహార నియమాలు పాటించాలి. తేలిక­పాటి ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, మసాలా పదార్థాలు, డ్రై ఫుడ్స్‌ తగ్గించి ఎ­క్కు­వగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. » వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిని వేడి సమయాల్లో ఇంట్లోనే ఉంచాలి. తగినంత నీటిని తాగేలా చూడాలి. » వ్యాయామాలు ఉదయం, సాయంత్రం మాత్రమే చేయాలి » కూలీలు, రైతులు ఉదయం 6–10 లేదా సాయంత్రం 5–7 సమయంలో పని చేయాలి. » రోడ్లపై పనిచేసే ట్రాఫిక్‌ పోలీసులు, కూలీలకు జాకెట్లు, నీటి పంపిణీ జరగాలి. వడదెబ్బ తగలకుండా ఢిల్లీ తరహాలో కూల్‌ రూమ్‌ కాన్సెప్‌్టను ప్రవేశపెడితే మంచిది. » అడవుల్లో జంతువుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి. హీట్‌ వేవ్‌ హాట్‌ స్పాట్లుకర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుఅన్ని చర్యలు తీసుకుంటున్నాంరోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఈ సంవత్సరం వేసవి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, తగిన చర్యలను సూచిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు కాటన్‌ వస్త్రాలు ధరించడం మంచిది. కళ్ల రక్షణ కోసం సన్‌ గ్లాసెస్‌ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు.

Akshay Tritiya impact on wedding industry and gold sales10
బంగారం..  కొనేదెలా..? 

న్యూఢిల్లీ: బంగారం ధర రూ.లక్షలకు పెరిగిపోవడం వినియోగదారులు, ముఖ్యంగా మహిళల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయింది. భారతీయ మహిళలకు బంగారంతో విడదీయలేని అనుబంధమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య కుటుంబాలకు చెందిన వారు సైతం బంగారు ఆభరణాల కోసమని చెప్పి తమకు తోచినంత పొదుపు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ధరలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని వారు ఇప్పుడు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ(మొదటి తదియ), వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధరలు 22 శాతం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే రూ.1.01 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.98వేల స్థాయిలో ఉంది. ఇలా అయితా ఎలా కొనగలం? ‘‘వచ్చే నవంబర్‌లో నా కుమార్తె వివాహం ఉంది. ఈలోపే బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వివాహం కోసం బంగారం ఎలా కొనుగోలు చేయాలి?’’ అన్నది నోయిడాకు చెందిన రూప అభిప్రాయం. పండగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు చేయకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ఢిల్లీ మయూర్‌ విహార్‌కు చెందిన సుశీలా దేవి మనోగతం. గతంలో 10 గ్రాములు కొనేవాళ్లం కాస్తా.. ఇప్పుడు 5 గ్రాములతో సరిపెట్టుకోవడమేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘నాకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఏటా ఒకసారి కొనుగోలు చేస్తుంటా. ధర రూ.లక్షకు చేరడం నన్ను కలచివేస్తోంది’’అని ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లా వాసి సీతా సాహు తెలిపారు. మరోవైపు చెప్పుకోతగ్గ స్థాయిలో బంగారం ఆభరణాలను సమకూర్చుకున్నవారు.. ధరలు భారీగా పెరిగిపోవడం పట్ల ఒకింత ఆనందాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా భర్త ఏటా బంగారం కొనిపెడుతుండేవారు. కానీ, నేడు ఆయన లేకపోయినప్పటికీ.. ఆభరణాలు మాత్రం నాకు గౌరవంతోపాటు, మద్దతుగా నిలుస్తున్నాయి’’అని పుణెకు చెందిన అర్చనా దేశ్‌ముఖ్‌ (65) చెప్పారు. అమ్మకాలపై ప్రభావం.. ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గుతున్నట్టు ఆభ రణాల వర్తకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వర్తకులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. ‘‘దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉ న్నాం. మొదటిసారి కస్టమర్ల మొహాల్లో అయోమయాన్ని చూస్తున్నాం. గతంలో కస్టమర్లు ఆభరణాల డిజైన్లను ఎన్నింటినో చూసేవారు. ఇప్పుడు వాటిని చూసి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే చిన్న వర్తకులు కొనసాగడం కష్టమే’’అని ఢిల్లీ మ యూర్‌ విహార్‌కు ‘ఊరి్మళా జ్యుయలర్స్‌’ స్వర్ణకారి ణి సోనూసోని తెలిపారు. కానీ మహిళలు బంగా రం తప్పకుండా పొదుపు చేసి, ఆభరణాలను కొనుగోలు చేస్తూనే ఉంటారని రాధేశ్యామ్‌ జ్యుయలర్స్‌కు చెందిన కరణ్‌ సోని అభిప్రాయపడ్డారు. లైట్‌ వెయిట్‌ జ్యుయలరీకి డిమాండ్‌? బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లు తేలికపాటి ఆభరణాలను కొనుగోలు చేయొచ్చని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ధరలు పెరిగినప్పటికీ లైట్‌ వెయిట్‌ ఆభరణాల రూపంలో మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు. ధరల పెరుగుదల పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. సురక్షిత సాధనంగా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడంతో క్రమంగా అమ్మకాలు సానుకూల స్థితికి చేరుకుంటాయన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో విక్రయాలను పెంచుకునేందుకు వర్తకులు అన్ని రకాల ధరల్లో ఆభరణాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధిక ధరలతో అమ్మకాల పరిమాణం క్రితం ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని లేదా 10 శాతం వరకు తగ్గొచ్చని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ అవినాష్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ, వివాహాల సీజన్‌ కావడంతో విక్రయాల పట్ల ఆశావహంగా ఉన్నట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement