Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt handed over AP state treasury to private individuals1
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PM Modi Big Message Over Pahalgam Incident In Mann Ki Baat2
భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్‌లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు.

Former IPS Officer PSR Anjaneyulu Facing Health Issues3
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు అస్వస్థత

గుంటూరు,సాక్షి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్‌ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Jhelum water release POK flood alert By Pakistan4
భారత్‌ దెబ్బ అదుర్స్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎమర్జెన్సీ!

దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇ​క, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025

IPL 2025: If Virat Manages To Score 30 Plus Runs In Todays Match Against Delhi, RCB May Win5
IPL 2025: విరాట్‌ 30కి పైగా స్కోర్‌ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం ​కాబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీ హోం గ్రౌండ్‌ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్‌రేట్‌లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్‌రేట్‌తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్‌ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ (93 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్‌ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్‌ నిగమ్‌ (4-0-18-2), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-17-2), ముకేశ్‌ కుమార్‌ (3-1-26-1), మోహిత్‌ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (37), కోహ్లి (22), రజత్‌ పాటిదార్‌ (25), కృనాల్‌ పాండ్యా (18), టిమ్‌ డేవిడ్‌ (37 నాటౌట్‌) రెండంకెల​ స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్‌ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్‌, స్టబ్స్‌ (38 నాటౌట్‌) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్‌ దయాల్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ప్రతీకారం​ తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్‌ ఢిల్లీ హోం గ్రౌండ్‌లో కావడంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్‌ 30కి పైగా స్కోర్‌ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. విరాట్‌ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌పై 7, ఢిల్లీపై 22, పంజాబ్‌పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్‌ 30కి పైగా స్కోర్‌ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో విరాట్‌ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Forces Identified Massive Cave In Operation Karre Gutta6
కర్రెగుట్టలో మావోయిస్టుల గుహ.. 1000 మంది ఉండేలా నీటి సౌకర్యం..

సాక్షి, చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య ఆపరేషన్ కర్రె గుట్టల్లో భాగంగా భద్రతా బలగాలు కీలక ముందడుగు వేశాయి. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో తాజాగా మావోయిస్టుల కీలక స్థావరమైన బంకర్‌ను బలగాలు గుర్తించాయి. ఈ గుహ గురించి కీలక విషయాలను వెల్లడించాయి.వివరాల ప్రకారం.. కర్రెగుట్టలో మావోయిస్టుల బంకర్‌(గుహ)ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక, ఆ గుహలో దాదాపు 1000 మంది సురక్షితంగా ఉండేలా ప్రదేశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు.. అక్కడి నుంచి మకాం మార్చినట్టు సమాచారం. మరోవైపు.. కర్రె గుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదరవుతున్నాయి. తాజాగా బంకర్‌(గుహ)కు సంబంధించి వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి.ఇదిలా ఉండగా.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్‌ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం.. 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్‌ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కి.మీ. పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Subham Movie Trailer: Samantha Cameo Role7
ట్రైలర్‌: సీరియల్స్‌ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!

హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్‌ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్‌గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఈ బ్యానర్‌లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్‌ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.సీరియల్స్‌ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యంఆదివారం (ఏప్రిల్‌ 27) నాడు ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్‌కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్‌ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్‌ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్‌ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.మే 9న రిలీజ్‌మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్‌లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తున్న సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి

SBI Card Q4 profit slips 19c to Rs 534 crore8
నిరాశపరిచిన ఎస్‌బీఐ కార్డ్‌

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్‌ (క్రెడిట్‌ కార్డు సేవల్లోని) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (2025 జనవరి–మార్చి) రూ.534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.662 కోట్లతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గిపోయింది. క్రెడిట్‌ కార్డులపై రుణ ఎగవేతలు పెరగడం లాభాలకు గండికొట్టింది. మొత్తం ఆదాయం మాత్రం ఇదే కాలంలో రూ.4,475 కోట్ల నుంచి రూ.4,832 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.2,415 కోట్లకు మెరుగుపడింది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,139 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక రుణాలు (వసూలు కాని/ఎన్‌పీఏలు) మొత్తం రుణాల్లో 3.08 శాతంగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2.76 శాతమే. నికర ఎన్‌పీఏలు గమనించినా.. 0.99 శాతం నుంచి 1.46 శాతానికి పెరిగాయి. నష్టాలు/మొండి బకాయిలకు కేటాయింపులు క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.944 కోట్లుగా ఉంటే, సమీక్షా కాలంలో రూ.1,245 కోట్లకు పెరిగిపోయాయి.ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ కార్డ్‌ రూ.1,916 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24లో నమోదైన రూ.2,408 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.17,484 కోట్ల నుంచి రూ.18,637 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాలన్స్‌ షీట్‌ విలువ రూ.58,171 కోట్ల నుంచి రూ.65,546 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేరు ధర ఒక శాతానికి పైగా లాభపడి రూ.927 వద్ద ముగిసింది.

Sakshi Editorial On Pahalgam Terror Attack9
ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Physical Changes During Pregnancy Whats Normal Or Not10
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..?

నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్‌ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి? – జాగృతి, కర్నూలు. గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్‌గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. మీ బ్లడ్‌ గ్రూప్‌ నెగటివ్‌ గ్రూప్‌ అయి, మీ భర్తది పాజిటివ్‌ గ్రూప్‌ ఉంటే కనుక, రీసస్‌ యాంటీ–డీ వ్యాక్సినేషన్‌ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్‌ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు. ఇప్పుడు ఫ్లూ సీజన్‌ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్‌ ఫ్లూ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్‌ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్‌ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్‌లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ల వలన శరీరంలో యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్‌ వర్క్‌ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి? – మమత, హైదరాబాద్‌. ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్‌ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్‌ చెప్పేది పాటిస్తూ, జాబ్‌ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్‌లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్‌ రీచ్‌ కాలేనప్పుడు టెన్షన్స్‌ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్‌ఫెక్షన్స్‌ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్‌ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి. తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్‌ సిస్టమ్‌ ఎఫెక్ట్‌ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి. నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి? – కీర్తి, నల్గొండ. చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్‌ హిక్స్‌ కంట్రాక్షన్స్‌ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్‌లాగా వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్‌ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్‌ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్‌గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్‌ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది. ఐరన్, కాల్షియం వంటి మినరల్స్‌ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్‌ ఇంటర్నల్‌ ఎగ్జామ్‌ చేసి, బేబీకి పెల్విస్‌ సరిపోతుందా అని చెక్‌ చేసి, నార్మల్‌ వెజైనల్‌ డెలివరీకి ప్లాన్‌ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్‌ విటమిన్స్‌ తీసుకోవాలి. పెల్విస్‌ ఫ్లోర్‌ లేదా కెగెల్‌ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్‌ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌ హైదరాబాద్‌ (చదవండి: మైక్‌ మహారాజా! యాడ్‌ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్‌..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement