
ఆరోగ్య సేవలు విస్తృతం చేస్తాం
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్యశాఖకు మంచి పేరు తీసుకొచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని డాక్టర్ కె.అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా ఆమె శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో పలు కీల కాంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో అత్యధిక సర్వీసు చేశానని, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అవకాశం రావడాన్ని సంతృప్తిగా స్వీకరిస్తున్నానన్నారు. జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేలా విజిట్స్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి 14 రోజులకొకసారి పీహెచ్‌సీ పరిధిలో ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలన్నారు. జిల్లాలో వైద్యశాఖకు ఇటీవల చెడ్డపేరు వచ్చిందన్న అంశాన్ని ప్రస్తావించగా, కచ్చితంగా మార్పు చూపిస్తామని, వచ్చే వారం మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేయనున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు. ఈమేరకు సన్నద్ధం చేస్తున్నామన్నారు.
ఈనెల 9వ తేదిన జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా విశాఖపట్నం రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.సుజాత ను నియమిస్తూ వైద్యశాఖ డైరక్టర్ డాక్టర్ బండారు సుబ్రహ్మణేశ్వరి రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈమె జిల్లాలో డీఎంహెచ్‌ఓగా విధుల్లో చేరలేనని, తనని తప్పించాలని కోరుతూ విన్నవించుకోగా.. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తదుపరి శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఆర్‌ఎంఓగా విధుల్లో ఉన్న డాక్టర్ కె.అనితకు ఎఫ్‌ఏసీ బాధ్యతలను అప్పగిస్తూ గురువారం రాత్రి కొత్త ఉత్తర్వులను డైరక్టరేట్ జారీ చేసింది.
నూతన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత
తనను విధుల నుంచి తప్పించాలని వేడుకున్న డాక్టర్ సుజాత