
డయాలసిస్ సేవలకు అంతరాయం
● తీవ్రంగా ఇబ్బంది పెట్టిన
విద్యుత్ అంతరాయాలు
● ఆరుసార్లు ఆగిపోయిన
డయాలసిస్ యంత్రాలు
కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్‌లో శుక్రవారం డయాలసిస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 20 బెడ్‌లతో ఉన్న సముదాయాన్ని నెఫ్రోప్లస్ సంస్థవారు నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి విద్యుత్ సమస్యతో అన్ని డయాలసిస్ మిషన్‌లు ఆరు సార్లు ఆగిపోయాయి. సాయమ్మ అనే పేషెంట్ ఉదయం పదకొండు గంటలకు వచ్చినా రాత్రి ఏడుగంటల వరకు ఉంచేయడంతో ఆయాసం అధికమై ప్రాణాప్రాయ స్థితికి చేరుకుంది. నెఫ్రోప్లస్ వారు నిర్వహిస్తున్న ఈ యూనిట్‌లో జనరేటర్ ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడి సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. డయాలసిస్ కేంద్రంలో ఎలక్ట్రీషియన్ లేకపోవడంతో తిరిగి ప్రభుత్వం నియమించిన కిడ్నీ ఆస్పత్రి ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయించారు. ఇదే విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదని, మరమ్మతులు చేసినప్పటికీ పలుమార్లు ట్రిప్ అవ్వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని అన్నారు.

డయాలసిస్ సేవలకు అంతరాయం