
ఆరోగ్యం భద్రం..!
వేసవికాలం..
జాగ్రత్తలు తప్పనిసరి
వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బయట ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండలో పనిచేయడం, తిరగడం వలన శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో క్రమం తప్పకుండా నీటిని తాగాలి. పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.
– ఆర్.కాళీప్రసాద్, ఎంపీడీవో, హిరమండలం
● రోజురోజుకూ పెరుగుతున్న వేసవి తాపం
● వడదెబ్బకు గురయ్యే ప్రమాదం
● అప్రమత్తంగా ఉండాలని సూచనలు
హిరమండలం:
వేసవితాపం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజంతా మండుటెండలో కష్టించి పనిచేసే వేతనదారులు, కార్మికులు తగు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత శాఖాధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వడదెబ్బకు గురవ్వడంతో పాటు అనారోగ్య సమస్యల బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఎండల్లో ఇబ్బందులు పడకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు
ప్రస్తుతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటకి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో చల్లని నీరు, నీడ వసతి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉపాధి వేతనదారులు, కార్మికులు, దుకాణాల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితర శ్రామికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో పనులు చేసుకోవాలి.
వదులైన పలుచని కాటన్ దుస్తులు ధరించాలి.
తలకు టోపీ పెట్టుకోవడం మంచిది.
మధ్యాహ్నం 12 గంటట నుంచి 4 గంటల మధ్య ఎండలో తిరగకూడదు
నీటిని ఎక్కువగా తాగాలి, మజ్జిగ తీసుకోవాలి.
గది ఉష్ణోగ్రతలను తగ్గించుకోవాలి. చక్కని వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి.
ఇంటి పైకప్పు మీద గడ్డిలాంటివి ఉంచి చల్లటి నీరు పట్టించాలి.
వడదెబ్బకు గురైన వ్యక్తికి చల్లని గాలి అందేలా చూడాలి. దుస్తులు వదులు చేయాలి.
వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి.
బాధితుడిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి.

ఆరోగ్యం భద్రం..!