
ఆదిత్యుని సన్నిధిలో సీపీఎఫ్ శ్రీలక్ష్మి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని మహారాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ (సీపీఎఫ్) అధికారి శ్రీలక్ష్మి తన భర్త వెంకటకృష్ణారావుతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. తొలిసారి అరసవల్లి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ ఈవో వై.భద్రాజీ సాంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు వీరి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. వీరితో పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు భాషా తదితరులు ఉన్నారు.
ఆర్థిక సాయం
అందజేత
సోంపేట: మండలంలోని రామయ్యపట్నం గ్రామానికి చెందిన వాడ ధర్మరాజు వలస మత్స్యకారుడిగా చైన్నె వెళ్లి ప్రమాదవశాత్తు ఏడాది క్రితం మృతి చెందాడు. దీంతో చైన్నెలోని బోటు యజమానులు, బోట్లకు వెళ్లే మత్స్యకారులు కలిసి రూ.2,50,000లు సేకరించి ధర్మరాజు భార్య జానకమ్మకు గ్రామంలో ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో వలస కార్మికులు, రామయ్యపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు.
రీ అపోర్షన్‌కు గురవుతున్న ఉపాధ్యాయులు
శ్రీకాకుళం: ప్రభుత్వం పాఠశాలల్లో ఒక్కసారిగా చేస్తున్న మార్పులు కారణంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు రీఅపోర్షన్‌కు గురవుతున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి, జి.రమణలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను మోడల్ ప్రాథమిక పాఠశాలల కోసం వేరే పాఠశాలలకు తరలించడం, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను తొలగించి, ప్రైమరీగా డీ గ్రేడ్ చేయడం వంటి కారణాల వలన ఎక్కువమంది ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడే పరిస్థితులు దాపురిస్తాయన్నారు. వీరంతా బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లనున్నారన్నారు. అయితే ప్రతీ శుక్రవారం సమావేశాలు జరుగుతున్నా ఇంతవరకూ వీరికి బదిలీల్లో ప్రాధాన్యత ఉండేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరకంగా రీఅపోర్షన్‌కు గురయ్యే ఉపాధ్యాయులకు ప్రస్తుత స్టేషన్ పాయింట్లతో పాటుగా పాతస్టేషన్ పాయింట్లు కూడా వచ్చేలా చేసి బదిలీల్లో కొంతవరకు న్యాయం చేయాలని కోరారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి
టెక్కలి రూరల్: వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం టెక్కలిలో చోటుచేసుకుంది. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన ఐదేళ్ల బాలుడు కె.తన్విక్ సాయి తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గుర్తించిన స్థానికులు బాలుడిని కుక్క నుంచి రక్షించి, టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

ఆదిత్యుని సన్నిధిలో సీపీఎఫ్ శ్రీలక్ష్మి