
ఇక నేరుగా చెల్లింపులు..!
● మున్సిపాలిటీ సాధారణ నిధులు ఖర్చుచేసే అవకాశం
శ్రీకాకుళం: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సమకూరే సాధారణ నిధులు నేరుగా ఖర్చు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. మున్సిపాలిటీలకు పన్నుల ద్వారా, షాపు అద్దెలు ద్వారా, ఆశీలు తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణ నిధులకు జమ చేస్తారు. ఇదివరకు ఇలా వసూలు చేసిన మొత్తాన్ని సీఎంఎఫ్‌ఎస్‌లో ఉండే ప్రత్యేక ఖాతాలకు జమచేసేవారు. మున్సిపాటీలు ఏవైనా బిల్లులు కానీ, ఖర్చులు కానీ చేయాలనుకుంటే ఆయా బిల్లులను సీఎంఎఫ్‌ఎస్‌కు పొందుపరిస్తే అక్కడ నుంచి నిధులు మంజూరు అయ్యేవి. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగరపాలక సంస్థ అధికారులే కాంట్రాక్టర్‌కు బిల్లులు, ఇతర ఖర్చులను నేరుగా చెల్లించే సౌలభ్యం ఉంటుంది. సంబంధిత అంశానికి సంబంధించిన విధివిధానాలను ఆర్థిక శాఖ ఆమోదించి సంబంధింత శాఖాధికారులకు నివేదించింది. రాష్ట్రాధికారులు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఒకటి రెండ్రురోజుల్లో వెలువరించనున్నారు. అందరి మున్సిపల్ అధికారులకు కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో విషయం తెలియజేశారు.
త్వరలోనే ఉత్తర్వులు
సాధారణ నిధులు నేరుగా ఖర్చు చేసే సౌలభ్యానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం వాస్తవమే. దీనివలన బిల్లుల చెల్లింపులో జాప్యం లేకండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
– పీవీడీ ప్రసాదరావు, కమిషనర్, శ్రీకాకుళం

ఇక నేరుగా చెల్లింపులు..!