కొనేది.. తినేది విషమే! | Health and Family Welfare Department report on food adulteration | Sakshi
Sakshi News home page

కొనేది.. తినేది విషమే!

Published Wed, Apr 9 2025 5:04 AM | Last Updated on Wed, Apr 9 2025 5:04 AM

Health and Family Welfare Department report on food adulteration

కలకలం రేపుతున్న ఆహార కల్తీ..  

దేశవ్యాప్తంగా ఇదే వ్యాపారం 

ప్రమాదకరంగా ఉత్తరప్రదేశ్‌.. ఆ తర్వాత జార్ఖండ్, లడఖ్‌లు.. 

కల్తీ జాబితాలో మెరుగ్గా తెలుగు రాష్ట్రాలు..  

నాలుగేళ్లలో 18.59 శాతం నుంచి 10.1 శాతానికి తెలంగాణ 

ముందువరుసలో హైదరాబాద్‌.. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలు 

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ ల్యాబ్‌ల పరీక్షల్లో వెల్లడి 

ఆహార కల్తీపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నివేదిక

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పాలు, పాల ఉత్పత్తులు, వంట నూనెలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, మిఠాయిలు.. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు.. పెరుగుతున్న ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీ ఆందోళన కలిగిస్తోంది. ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నా.. అరికట్టే విషయమై కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. దేశ ప్రజల ఆరోగ్యం, కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తదితర అంశాలను అంచనా వేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనం చేయాల్సి ఉంది. 

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ (ఎఫ్‌ఎస్‌డబ్ల్యూ) ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. మూడేళ్లుగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలను ల్యాబ్‌లో టెస్టుకు పంపి కనుగొన్న కల్తీ శాతం పరిశీలిస్తే ఒళ్లు జలదరిస్తోంది. 

చాలాచోట్ల భయంకరంగా ఆహార ఉత్పత్తుల కల్తీ జరుగుతున్నట్లు నివేదికల్లో తేలగా.. తెలంగాణలో నాలుగేళ్లలో ఆహార కల్తీశాతం 18.59 నుంచి 10.1 శాతానికి తగ్గగా.. ఎక్కువగా హైదరాబాద్‌.. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ కల్తీ ఆనవాళ్లు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయి.  

కల్తీ గణాంకాలివి.. 
ఆహార పదార్థాలకు శాస్త్రీయ ఆధారిత ప్రమాణాలు, వినియోగానికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం లభ్యతను నిర్ధారించడంతోపాటు వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతులను నియంత్రించడానికి 2008లో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)ని స్థాపించారు. 

ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో నాణ్యత లేని ఆహారం, తప్పుడు బ్రాండ్, సురక్షితం కాని ఆహారంపై చర్యలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నిరి్ధష్ట నిబంధనలున్నాయి. ఈ మేరకు ఆహార ఉత్పత్తుల నమూనాలను ఆకస్మికంగా సేకరించి.. క్రమం తప్పకుండా నిఘా, పర్యవేక్షణ, తనిఖీ నిర్వహిస్తుంది. ఆహార నమూనాలు అనుగుణంగా లేవని తేలితే.. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం ఆహార వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. 

ఇంకా, మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రాథమిక పరీక్ష సౌకర్యాలను విస్తరించడానికి ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ (ఎఫ్‌ఎస్‌డబ్ల్యూ) ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షించి నివేదికలు వెల్లడిస్తారు. ఈ క్రమంలోనే ప్రధానంగా కల్తీకి అయ్యే ఆహారాలు, వస్తువులపై 2021–22 నుంచి 2024–25 వరకు వివిధ ఆహార పదార్థాల్లో కనుగొన్న కల్తీ శాతంపై రాష్ట్రాల వారీగా వెల్లడించిన నివేదికల వివరాలివి.  

2021–22లో.. 
36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేకరించిన నమూనాల్లో ఆహార కల్తీపై నివేదికలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో 21,987 నమూనాలను పరీక్షించగా 13,153 (59.82 శాతం)లు కల్తీగా తేలింది. ఆ తర్వాత జార్ఖండ్‌లో 175 నమూనాల్లో 85 (48.57 శాతం), లడఖ్‌లో 47కు 19 (40.43 శాతం), హరియాణాలో 4,235కు 1182 (27.91 శాతం)లు కల్తీగా తేలాయి. గోవా, కేరళ, కర్ణాటక, గుజరాత్, మణిపూర్‌లు కల్తీగా దూరంగా ఉన్నాయి. తెలంగాణలో 3,077కు 353 (11.47 శాతం) నమూనాలు కల్తీ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 5,290కు 533 (10.08 శాతం) నమూనాల్లో కల్తీ ఉంది.  

2022–23లో.. 
ఈ ఏడాది కూడా ఉత్తరప్రదేశ్‌ 30,140 నమూనాల్లో 18,108 (60.08 శాతం)లు కల్తీ జరిగినట్లు తేలగా.. ఆహార కల్తీలో అగ్రభాగాన నిలిచింది. జార్ఖండ్‌లో 943 నమూనాల్లో 370 (39.24 శాతం), తమిళనాడులో 24,188లలో 7,924 (32.76 శాతం), హరియాణాలో 4,445లలో 1,425 (32.06 శాతం), రాజస్తాన్‌లో 13,184లలో 3,965 (30.07 శాతం)లు కల్తీ అయ్యాయి. తెలంగాణలో 4,809 నమూనాల్లో 894 (18.59 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 3,607లకు 314 (8.71 శాతం)లో ఉన్నాయి. బిహార్, డయ్యూడామన్, గుజరాత్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌లలో కల్తీ శాతం తక్కువే. 

2023–24లో.. 
ఆహార, వస్తువుల కల్తీలో ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌ను జార్ఖండ్‌ అధిగమించింది. 384 నమూనాల్లో 292 (76.04 శాతం)లు కల్తీ కాగా, ఉత్తరప్రదేశ్‌లో 27,750 లకు 16,183 (58.32 శాతం)లతో కల్తీలో రెండో స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 1,618 నమూనాలకు 401 (24.78 శాతం), హరియాణాలో 3,485లకు 856 (24.56 శాతం), రాజస్తాన్‌లో 18,536లకు 3,493(18.84శాతం)లుగా ఉన్నాయి. మణిపూర్‌లో 1.79 శాతం, నాగాలాండ్‌ 2.17 శాతం, గోవాలో 2.67 శాతం, మేఘాలయలో 5.69 శాతం, బిహార్‌లో 4.49 శాతం కల్తీ ఉన్నట్లు తేలగా, తెలంగాణలో 6,156 నమూనాలకు 973 (15.81 శాతం)లుగా తేలింది. 

2024–25 (2024 సెపె్టంబర్‌ వరకు)లో.. 
13,305 నమూనాల్లో 7,030 (52.8 శాతం)తో ఉత్తరప్రదేశ్‌ కల్తీలో మొదటిస్థానంలోనే నిలిచింది. ఆ తర్వాత 151లలో 54 (35.8 శాతం)తో జార్ఖండ్, 6,576లలో 1,865 (28.4 శాతం)లతో రాజస్థాన్, 1,628లలో 358 (22 శాతం)లతో పంజాబ్‌ రాష్ట్రాలు కల్తీకి చిరునామాగా నిలిచాయి. మిజోరాంలో కల్తీ ఆనవాళ్లే లేకపోగా, మేఘాలయలో 139లకు 1 (0.7 శాతం), నాగాలాండ్‌ 135లకు 2 (1.5 శాతం), ఢిల్లీ 1192 నమూనాలకు 42 (3.5 శాతం)లు కల్తీగా తేలాయి. తెలంగాణ 1,660 నమూనాల్లో 167 (10.1 శాతం)కు కల్తీ తగ్గినట్లు నమోదైంది. 

మొక్కుబడిగా తనిఖీలు..  
ఆహార, వస్తువుల కల్తీ నియంత్రణపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. నామమాత్రపు తనిఖీలు, మామూలు జరిమానాలు, శిక్షలకు వెరవని వ్యాపారులు కల్తీ పంథాను వీడటం లేదు. 1954 ఆహార కల్తీ చట్టంలో భారీ జరిమానాలు, శిక్షలు ఉండేవి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఏర్పాటయ్యాక ఆ తీవ్రత లేదు. ఆహార, వస్తువుల కల్తీ పరీక్షలకు సరైన ల్యాబ్‌లు లేవు. కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఉన్నది మూతపడగా, తెలంగాణలో కేవలం నాచారంలోనే ఉంది. ప్రతీ జిల్లా కేంద్రానికొకటి ఏర్పాటు చేసి కల్తీపై నిబంధనలను కఠినతరం చేసి అమలు చేయాలి.   – సాంబరాజు చక్రపాణి, జాతీయ ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల మండలి  

ఏదైనా జరిగితేనే తనిఖీలు  
హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ పెద్ద నగరం. ఆహార కల్తీతో ఎవరైనా అస్వస్థతకు గురై.. వివాదాస్పదమైతే తప్ప అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదు. నాలుగైదు నెలల కిందట విస్తృతంగా తనిఖీలు చేసి వదిలేస్తే మళ్లీ మామూలే అయ్యింది. కల్తీ వల్ల బయట టీ, టిఫిన్‌ చేయాలన్నా భయంగా ఉంది. ఇంత పెద్ద నగరంలో కనీసం ఆహార కల్తీని పరిక్షించే ల్యాబొరేటరీ లేకపోవడం దురదృష్టకరం. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.  – అయిత హరీశ్, కిషన్‌పుర, హనుమకొండ 

ఆహార కల్తీని అరికట్టాలి 
హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో శుభ్రత, వంటకాల్లో నాణ్యత పాటించలేదు. నిల్వ చేసిన ఆహారాన్ని హోటల్‌ నిర్వాహకులు వేడి చేసి ఇస్తున్నారు. నాణ్యత ఉండటం లేదన్న ఆరోపణలపై మొక్కుబడిగా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. కల్తీ ఆహారం వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రజలు కిడ్నీ, అల్సర్, ఇతర రోగాల పాలవుతున్నారు.  – ఎం.మిథిలా,  ఎంబీబీఎస్‌ విద్యారి్థ, వరంగల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement