కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని భౌతికంగా అంతం చేయాలనే వేధింపులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేయడం కొత్త కాదని, ముద్రగడ మాత్రం అలా పాదయాత్ర చేయడానికి అనుమతి లేదని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ అంటున్నారని.. వాళ్లిద్దరూ చెప్పినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. ముద్రగడ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మనాభం ఇంటి పక్కన చిన్న జిన్నింగు మిల్లు ఉంటే దాన్ని ఆక్రమించుకుని పోలీసులు అక్కడ చేరారని, ఇది సరైన విధానం కాదు, దీన్ని మార్చుకోవాలని చెబుతున్నామని అన్నారు. ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పాదయాత్రను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతాయని హెచ్చరించారు.