ఏటీఎంలో చిరిగిన నోట్లు
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే ఎవర్ని అడగాలో తెలియక ఖాతా దారులు లబోదిబోమంటున్నారు. ఆరిలోవ బాలాజీనగర్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఏటీఎం ఏర్పాటు చేశారు. అందులో రెండు రోజుల నుంచి చిరిగిపోయిన రూ.2000 లు నోట్లు వస్తున్నాయి. దీంతో ఇక్కడ విత్‌డ్రా చేసిన ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బాలాజీనగర్‌కు చెందిన ఒమ్మి గోవర్థనరావు అనే యువకుడు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఏటీఎంలో రూ.20,000లు విత్‌డ్రా చేశాడు. అన్నీ రూ.2000లు నోట్లు వచ్చాయి. వాటిలో ఒక నోటు రెండు ముక్కలు అతికించి ఉన్నది వచ్చింది. ఆ నోటును మరో వ్యక్తి ఖాతాలో వేయడానికి వేరే బ్యాంకు డిపాజిట్ మెషిన్లో పెట్టగా ఈ నోటును తిరస్కరించింది.
గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఎల్.రమణ అనే మరో యువకుడు ఇదే ఏటీఎంలో రూ.రెండు వేలు విత్‌డ్రా చేవాడు. అతనికి కూడా చిరిగిపోయిన రూ.2000 నోటుకు ప్లాస్టరు అంటించి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో రవీంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్ ఇక్కడ రూ.14,000లు విత్‌డ్రా చేశారు. అతనికి వచ్చిన 7 రూ.2000లు నోట్లులో 3 నోట్లు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో వీరంతా వెంకోజీపాలెంలో ఉన్న బీవోఐ బ్యాంకుకు వెళ్లి మేనేజరును సంప్రదించగా.. నగదు డిపాజిట్ తాము చేయడం లేదని, ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేశామని, తమకు సంబంధలేదని తేల్చి చెప్పేశారు. సాయంత్రం నగదు పెట్టడానికి ఈ ఏటీఎం వద్దకు వచ్చిన ఏజెంట్లను బాధితులు నిలదీశారు. బ్యాంకు ఇచ్చిన నగదు నోట్ల కట్టలనే తాము ఇందులో నింపుతామంటూ వారు తప్పించుకొని వెళ్లిపోయారు. బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది కలిసి ఖాతాదారులతో ఆటలాడుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.