విహారయాత్రకు వెళ్లిన విద్యార్థినిపై దారుణం
కోల్కతా: సిక్కింకు విహారయాత్రకు వెళ్లిన కోల్కతాకు చెందిన విద్యార్థినిపై టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడు ప్రేమ్రాజ్తో పాటు అతని స్నేహితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఈ నెల 13న కోల్కతాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు విహారయాత్రకు సిక్కిం వెళ్లారు. గ్యాంగ్ టక్లో బంధువుల హోటల్లో బస చేశారు. గ్యాంగ్టక్ చుట్టుపక్కల ఉన్న విహారప్రదేశాలను చూసేందుకు వారు ముగ్గురు ఓ టాక్సీ మాట్లాడుకున్నారు.
కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత డ్రైవర్ వారికి చిప్స్, నీళ్లు అందించాడు. ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి వాటిని తీసుకోగా, వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు అమ్మాయిలు తినలేదు. చిప్స్ తిన్న తర్వాత ఆ అమ్మాయికి మత్తురావడంతో డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు అమ్మాయిలు డ్రైవర్ను నిలదీశారు. డ్రైవర్ వారిద్దరినీ కారులోంచి తోసివేసి, మత్తులో ఉన్న అమ్మాయిని తీసుకుపోయాడు.
ఇద్దరు అమ్మాయిలు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి గ్రామస్తులకు ఈ విషయం చెప్పారు. విద్యార్థినులు బస చేసిన హోటల్ యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్థానికుల సాయంతో గాలించి నిందితుడిని అరెస్ట్ చేసి, బాధితురాలిని కాపాడారు. విద్యార్థిని ముఖం, మెడపై గాయాలయ్యాయని, ఆమె షాక్లో ఉందని స్థానికులు చెప్పారు.