ఆ సీఎం.. వెన్నుపోటు పొడిచారు!
బిహార్ గడ్డమీద.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పేరు ప్రస్తావించకుండానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా పట్నాలో నిర్వహించిన రోడ్షోలో ఆమె నిప్పులు కురిపించారు. వెన్నుపోటు పొడిచేవాళ్ల గురించి తాను ఎక్కువ మాట్లాడబోనన్నారు. పెద్దనోట్ల రద్దును బిహార్ సీఎం నితీష్ కుమార్ సమర్థిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు బినామీ ఆస్తులపై కూడా కొరడా ఝళిపించాలని ఆయన గట్టిగా అడుగుతున్నారు. ఈ విషయాన్నే ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ అంతకుముందు తమతో కలిసి అన్ని విషయాల్లో కేంద్రప్రభుత్వంపై పోరాడిన సీఎం.. ఇప్పుడు ఇలా చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిహారీ వలస కార్మికులకు పనులు లేక అల్లాడుతున్నారని, తిండి కోసం దేశమంతా తిరుగుతున్నారని, అలాంటి సమయంలో వాళ్లకు నాయకులు మద్దతుగా నిలవాలని అన్నారు.
బిహార్ పర్యటనకు వచ్చిన తనుకు స్వాగతం పలికేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక సీనియర్ మంత్రిని కూడా పంపలేపదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గతవారం ఆమె లక్నోలో పెద్దనోట్ల రద్దుపై ర్యాలీ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. తన మంత్రులతో కలిసి మమత ర్యాలీలో పాల్గొన్నారు. కానీ బిహార్లో మాత్రం ఆమెకు నితీష్ స్వాగతం లభించకపోవడంతో.. రాష్ట్ర అతిథిగా వచ్చినా కూడా సీఎంను కలవలేదు.
దానికి బదులు ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆర్జేడీ నాయకుడు లాలుప్రసాద్ ఇంటికి మాత్రం వెళ్లి, అక్కడ ఆయన భార్య రబ్రీదేవిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. బిహార్ మంత్రివర్గంలో ఉన్న లాలు కొడుకులిద్దరు ఆమెను కలవలేదు, ర్యాలీలో పాల్గొనలేదు. పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడు మాత్రం ర్యాలీలో పాల్గొన్నారు.