జూన్‌ 4 బీజేడీ సర్కార్‌కు ఆఖరిరోజు: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

నవీన్‌ పట్నాయక్‌ సర్కార్‌‌పై ప్రధాని మోదీ విసుర్లు

Published Mon, May 6 2024 1:59 PM

Elections 2024: PM Modi Direct Attack Odisha Naveen Patnaik BJD Govt

భువనేశ్వర్‌: ఒడిశాలోనూ రాబోయేది డబుల్‌ ఇంజిన్‌ సర్కారేనని, జూన్‌లో జరగబోయే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను వస్తానంటూ బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బెహ్రాంపూర్‌ గాంజాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన నేరుగానే నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై విసుర్లు విసిరారు.

ఒడిషాను కాంగ్రెస్‌.. ఆ తర్వాత బీజూ జనతా దళ్‌ డెబ్బై ఏళ్లపాటు దోచుకున్నాయి. ఒడిషాలో నీరు ఉంది. సారవంతమైన భూములు ఉన్నాయి. ఖనిజ లవణాలతో కూడిన నేలలు ఉన్నాయి. తీర ప్రాంతం ఉంది. భగవంతుడు ఈ నేలకు అపారమైన సంపద ఇచ్చాడు. అయినా కూడా రాష్ట్రం పేదరికంలోనే మగ్గుతోంది. అందుకు కారణం ఏంటి?..కాంగ్రెస్‌, బీజేడీ నేతలు కొనసాగించిన దొపిడీనే ఇందుకు కారణం. బీజేడీలో ఉన్న చోటా నేతలకు కూడా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయంటే అర్థం ఏంటి?.

.. ఇక్కడి కూలీపనులు చేసుకునేవాళ్లు వలసలు వెళ్లడానికి కారణాలు ఏంటి?. ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఎందుకు ఉన్నాయి?. బడికి వెళ్లని చిన్నారుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?.. ఒడిషా ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకోవడం లేదు. గర్భవతులకు కేంద్రం నెలకు రూ.6వేలు ఆసరా ఇచ్చేది. దానిని ఒడిశా ప్రభుత్వం రద్దు చేసిందంటే మీరు ఆశ్చర్యపోతారు.

యూపీఏ పదేళ్ల కాలంలో కేంద్రం ఒడిషాకు ఇచ్చింది లక్ష కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, మోదీ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల ఇచ్చింది. జల జీవన్‌ మిషన్‌ కింద పది వేల కోట్లు కేటాయించింది. కానీ, ఇక్కడి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. మోదీ ప్రభుత్వం మీ కోసం ఉచితంగా బియ్యం పంపిస్తుంటే.. బీజేడీ ప్రభుత్వం మాత్రం ఆ ప్యాకెట్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటోంది.

ఒడిషా ప్రజలు ఆలోచనతో బీజేపీకి ఓటేయాలి. జూన్‌ 4వ తేదీ బీజేపీ ప్రభుత్వానికి ఆఖరి తేదీ. ఒడిషాలో కమలం వికసించడం ఖాయం. బీజేపీ సీఎం ప్రమాస్వీకారానికి నేనుస్తాను. అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఒడిషా యూనిట్‌పై, అది రూపొందించిన మేనిఫెస్టోపై మోదీ ప్రశంసలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమికి దూరంగా బీజేడీ.. పార్లమెంట్‌లో మాత్రం కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఈ దఫా ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్‌లో ఒడిషాలోని 21 లోక్‌సభ సీట్లతో పాటు  ఆ రాష్ట్ర అసెంబ్లీ 147 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Advertisement
Advertisement