సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్‌లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు.
ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.
మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్‌లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.
మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment