
‘లాపతా లేడీస్’లో జయ.. సేంద్రీయ వ్యవసాయంలో పట్టభద్రురాలు కావాలనుకుంటుంది. కానీ వాళ్లమ్మ ఆమెకు పెళ్లిచేసి అత్తారింటికి పంపాలనుకుంటుంది. పంపేస్తుంది కూడా! సిమ్లాలో పెరిగిన ప్రతిభా రంతా.. హీరోయిన్ కావాలనుకుంది. ఆమె చదువుసంధ్యలను దగ్గరుండి చూసుకున్న ఆమె నానమ్మ.. ‘హీరోయిన్ అయితే నిన్నెవరు పెళ్లాడతారు?’ అని కలవరపడింది. వద్దని వారించింది. ‘లాపతా లేడీస్’ జయ.. పెళ్లయినా తన కలను నెరవేర్చుకుంటుంది. ‘సిమ్లా’ ప్రతిభా.. జీవితానికి పెళ్లే పరమావధి కాదని.. తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంది.. ‘లాపతా లేడీస్’లో హీరోయిన్ అయ్యి! యెస్.. ‘లాపతా లేడీస్’ జయే..‘సిమ్లా’ ప్రతిభా రంతా! ఆమె పతానే ఇది..

ప్రతిభా పుట్టింది సిమ్లాకి వంద కిలోమీటర్ల దూరంలోని ‘రోడో’ లో. పెరిగింది మాత్రం సిమ్లాలో ఉద్యోగం చేస్తున్న నానమ్మ శాంతి రంతా దగ్గర. ప్రతిభా తల్లిదండ్రులు సందేశ్నా రంతా, రాజేశ్ రంతా సొంతూర్లోని తమ యాపిల్ తోటల సాగు చూసుకునేవాళ్లు.

చదువుతో పాటు డాన్స్, డ్రామా అంటే కూడా మనసు పారేసుకుంది ప్రతిభా. అందుకే డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. డ్రామాల్లోనూ నటించింది. ఈ రెండిటికి సంబంధించి సిమ్లాలో ఏ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొనేది.. ప్రైజులు పట్టుకెళ్లేది.

నటనలో ఆమెకు సిమ్లా వాస్తవ్యురాలు ప్రీతీ జింతాయే ఆదర్శం. అందుకే ప్రతిభా ఫ్రెండ్స్ అంతా ఆమెను ‘జూనియర్ ప్రీతీ జింతా’ అని పిలిచేవాళ్లట.

ట్వల్త్ క్లాస్ అయిపోయాక.. ఇంట్లోవాళ్లకు తెలియకుండా ముంబై యూనివర్సిటీలోని బీఏ ఫిల్మ్ మేకింగ్‌కి దరఖాస్తు పెట్టుకుంది. సీట్ ఖరారు అయ్యాక ఇంట్లో చెప్పింది. అప్పుడే వాళ్ల నానమ్మ అన్నది ‘హీరోయిన్ అయితే నిన్ను పెళ్లిచేసుకునేదెవరు?’ అని! సినిమాల్లో నటించే అమ్మాయిలంటే జనాలకు పెద్ద గౌరవం ఉండదని, ఆ రంగంలో సక్సెస్ అవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని వాళ్ల నానమ్మ స్థిరాభిప్రాయం. ‘మన ఊరు అమ్మాయి ప్రీతీ జింతా సక్సెస్‌ఫుల్ కాలేదా?’ అని ప్రతిభా ధైర్యం. ‘అందరి అదృష్టం ప్రీతీ జింతాలా ఉండొద్దూ!’ నానమ్మ భయం. చివరకు ప్రతిభా ధైర్యమే గెలిచింది.

తన కలను పట్టుకుని ముంబై చేరింది ప్రతిభా. నటన కంటే ముందు మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. వదులుకోలేదు. అందాల పోటీల్లోనూ పాల్గొంది. మిస్ ముంబై కిరీటాన్ని గెలుచుకుంది. దాంతో పాటు గుర్తింపును కూడా! ఆడిషన్స్‌లో ముందు టెలివిజన్ ఆమెను సెలెక్ట్ చేసుకుంది ‘కుర్బాన్ హువా’ అనే సీరియల్‌తో.

తర్వాత చాన్స్ కూడా ‘ఆధా ఇష్క్’ అనే సీరియల్‌దే! ఆ షూటింగ్‌లో ఉన్నప్పుడే ‘లాపతా లేడీస్’ ఆడిషన్స్‌కి వెళ్లింది. ఆమెను జయ అలియాస్ పుష్ప రాణి క్యారెక్టర్ వరించింది. నటనకు తన పతా చూపించింది. అది పట్టుకుని సంజయ్‌లీలా భన్సాలీ ‘హీరామండీ (నెట్‌ఫ్లిక్స్ సిరీస్)’ వచ్చింది ఆమె చెంతకు. అందులో ‘షమా’గా ఆమె కనిపించింది కాసేపే అయినా వెలిగిపోయింది. ఈ రెండిటితో ఇప్పుడామె సినీ, వెబ్ వీక్షకుల అభిమాన నటి అయిపోయింది.

యాక్ట్రెస్‌గా నిరూపించుకోవాలని టీవీ సీరియల్స్‌లో చాలా కష్టపడ్డాను. ఆ ఒత్తిడితో బాగాసన్నబడ్డాను. అలా నన్ను నేను అద్దంలో చూసుకుంటే నా మీద నాకే జాలేసేది. కానీ అదే నాకు వరమైంది. ఎందుకంటే ‘లాపతా లేడీస్’లోని జయ క్యారెక్టర్‌కి కిరణ్ రావు మేడం.. నాలాంటి బక్కపల్చటి అమ్మాయి కోసమే వెదకసాగారట. అందుకే ఆడిషన్స్‌లో నన్ను చూడగానే సెలెక్ట్ చేశారు’ అని ప్రతిభా రంతా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.



