
సాక్షి, అమరావతి: సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలని అనుకున్నామన్నారు. కానీ మార్గదర్శకాలు సరళతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లేనిపోని నిబంధనలతో పథకాన్ని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మార్గదర్శకాలను సరళీకరిస్తున్నామన్నారు. మార్గదర్శకాలన్నింటిని మీడియా ద్వారా వెల్లడించిన తర్వాత ఈ నెల 12న ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతామని కృష్ణబాబు తెలిపారు.