
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కోస్తాపై బలహీనంగానూ, రాయలసీమ ప్రాంతాల్లో చురుగ్గానూ ఉంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. కోస్తా, రాయలసీమల్లో 29, 30 తేదీల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. గత 24 గంటల్లో ఎమ్మిగనూరులో 4 సెం.మీ, నల్లమడ, కాకినాడ, నందవరంలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.