
రియల్ మోసం
నందికొట్కూరురూరల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ వికలాంగుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తక్కువ ధరకు పొలం ఇప్పిస్తానని చెప్పి ఓ ఉద్యోగి డబ్బులు స్వాహా చేయడంతో మోసపోయిన....
నందికొట్కూరురూరల్:
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ వికలాంగుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తక్కువ ధరకు పొలం ఇప్పిస్తానని చెప్పి ఓ ఉద్యోగి డబ్బులు స్వాహా చేయడంతో మోసపోయిన యువకుడు జీవితంపై విరక్తి చెంది బలవన్మరం పొందిన సంఘటన మండల పరిధిలోని నాగటూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ నరసింహులు(28) శనివారం తెల్లవారు జామున స్థానిక ఆర్‌టీసీ బస్టాండులో పురుగుల మందు తాగి ఆపస్మారకస్థితికి చేరుకోవడంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన క్షత గాత్రుడిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నరసింహులు కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్రమంలో కర్నూలు నగరం బీ క్యాంపులోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి రాజానాయక్‌తో పరిచయం ఏర్పడింది. తన భార్య ఉమమహహేశ్వరమ్మ రె వెన్యూ కార్యాలయంలో పనిచేస్తుందని, తక్కువ ధరకే విలువైన పొలం ఇప్పిస్తానని నరసింహులును నమ్మించాడు.
దీంతో తక్కువ ధరకే మంచి ఇళ్ల స్థలం ఇప్పిస్తానని ఆ యువకుడు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద రూ.9 లక్షలు, తాను కూడబెట్టుకున్న రూ. లక్ష కలిపి మొత్తం రూ.10 లక్షలు రాజానాయక్ చేతిలో పెట్టాడు. డబ్బు తీసుకున్న ఆ ఉద్యోగి అదిగో..ఇదిగో అంటూ కొన్నాళ్లు సతాయించాడు. చివరకు మాట మార్చి నాకు డుబ్బులు ఇచ్చినట్లు నీ దగ్గర ఎలాంటి ఆధారం లేదని నిరాకరించాడు.
దీంతో తన వద్ద వాయిస్ రికార్డు ఉందని చూపించినా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి కనికరించకపోవడంతో వారం రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న వ్యక్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఇంటర్ వరకు చదువుకొని ఆ తర్వాత వికలాంగుల సమస్యలపై పొరాటాలు చేశాడు. ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. మృతుడి తల్లి అక్కమ్మ ఫిర్యాదు మేరకు నందికొట్కూరు ఎస్‌ఐ జమీర్ కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.