
అనంతపురం, సప్తగిరి సర్కిల్: తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి తాళం పడిందని, అమరావతిలోని ఆపార్టీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. ఆయన అనంతపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని దుష్ట శక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా.. ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు.
పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపారన్నారు. ఆయన ఆశయాలతో పార్టీని స్థాపించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జనరంజక పాలన అందిస్తారని, అప్పుడు చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో టీడీపీ పార్టీ ఐస్ లాగా కరిగిపోవడం ఖాయమవడంతో చంద్రబాబుకు భయంపట్టుకుందని, దీంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి కళ్లకు కనిపిస్తున్నందున భరించలేక వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి సుభిక్ష పాలనను అందించేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.