తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
గూడూరు(మహబూబాబాద్): తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బచ్చలి కుమారస్వామి, పద్మ దంపతుల కుమార్తె నవిత(17) గూడూరులోని జూనియర్ కాలేజిలో ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటోంది.
ఇంటి పనుల్లో సాయ పడకుండా, చదువుకోకుండా కాలక్షేపం చేస్తోందంటూ తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం నవితను మందలించారు. మనస్తాపం చెందిన ఆమె అప్పుడే ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు తెలిసిన వారిని, స్నేహితుల ఇళ్లవద్ద ఆరా తీశారు. ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం ఆమె మృతదేహం ఊరకుంట చెరువులో తేలియాడుతుండగాస్థానికులు గమనించారు. మందలించినందుకు మనస్తాపం చెందిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.