
పాలి‘ట్రిక్స్’పై మేయర్ అసహనం
నగరపాలక సంస్థ రాజకీయాలపై తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పెత్తనం పేట్రేగుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్ర అసహనంతో ఉన్నారు.
♦ పట్టాభి నియామకంపై సీనియర్ల గుర్రు
♦ సీఎంకు ఫిర్యాదు చేయాలనే యోచన
♦ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే పరువు తీస్తున్నారు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రాజకీయాలపై తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పెత్తనం పేట్రేగుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్ర అసహనంతో ఉన్నారు. కార్పొరేషన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా తాజాగా పట్టాభిని నియమించడంపై గుర్రుగా ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజార్టీ ఉన్న కౌన్సిల్‌లో అధిష్ఠా నం పాలి‘ట్రిక్స్’తో అభాసుపాలవుతున్నామనే ఆవేదం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవలే పార్టీ సీనియర్ కార్పొరేటర్లతో మేయర్ భేటీ అయిన సందర్భంలో పట్టాభి నియామక విషయం చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది.
బయటి వ్యక్తులకు పెత్తనం అప్పగించడం వల్ల తన చైర్ వీక్ అవుతోందనే అభిప్రాయాన్ని మేయర్ వ్యక్తం చేసినట్లు భోగట్టా. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ పాలి‘ట్రిక్స్’పై మేయర్ అసహనం ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్‌తో మాట్లాడి కార్పొరేషన్‌లో తమకు కావాల్సిన పనుల్ని గప్‌చుప్‌గా చక్కబెట్టేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. డెప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవుల మార్పునకు సంబంధించి అధిష్ఠానం చేస్తున్న ప్రచారంతో పార్టీ డామేజ్ అవుతోందనే అభిప్రాయాన్ని మేయర్ వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎదురీత..
నగరపాలక సంస్థ రాజకీయాల్లో మేయర్ ఎదురీత సాగించాల్సి వస్తోంది. అధికారుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంది. కమిషనర్ జి.వీరపాండియన్ పనితీరు బాగోలేదంటూ మేయర్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కలెక్టర్‌తోనే ఎక్కువ సమయం గడపడంతో కార్పొరేషన్లో పనులు సకాలంలో పూర్తి కావడం లేదన్నది ఆయన వాదన. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో కలెక్టర్ బాబు.ఏ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కమిషనర్ వ్యవహారశైలిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. ఎస్టేట్స్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల వ్యవహారశైలిపై మేయర్ అసంతృప్తితో ఉన్నారు.
ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే రూ.కోట్లు ఆదాయం పెరుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన తరుచూ వ్యక్తం చేస్తుంటారు. పార్టీ నాయకుల వ్యవహార శైలి, కార్పొరేషన్ పాలి‘ట్రిక్స్’పై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలనే యోచనలో మేయర్ ఉన్నట్లు వినికిడి.
అల్లరి చేస్తోంది అధిష్ఠానమే..
దర్గా భూముల తీర్మానం మార్పు, కనకదుర్గ లే అవుట్‌కు ‘పచ్చ’జెండా ఊపడం వంటి వ్యవహారాల్లో టీడీపీ అవినీతి మకిలి అంటించుకుంది. మేయర్ చైర్‌ను లక్ష్యం చేసి ఆయన ప్రత్యర్థుల పావులు కదిపారు. ఈ రెండు సందర్భాల్లో కూడా అధిష్టానం వ్యవహరించిన తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందనేది మేయర్ అభిప్రాయం. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాల్లో సైతం రచ్చ చేశారని సన్నిహితుల వద్ద మేయర్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఓ సీనియర్ కార్పొరేటర్ శ్రీధర్‌ను మారుస్తున్నారంటూ ప్రచారం నిర్వహించడంపై మేయర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం వైఖరి వల్లే అతను దుష్ర్పచారం చేస్తున్నారనే అభిప్రాయాన్ని సహచర కార్పొరేటర్ల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నో సాధించిన తనపై విషప్రచారం చేయడం సరికాదనే ఆవేదన వెలిబుచ్చినట్లు సమాచారం.