
చిరంజీవికి ఓటరు షాక్!
కేంద్ర మంత్రి చిరంజీవికి ఒక యువ ఓటరు షాకిచ్చారు. ఓటు వేయడానికి క్యూలైనును తోసిరాజని ముందుకు వెళ్లిన ఆయనను.. ఇదేమిటంటూ అందరి ముందూ నిలదీశారు. దీంతో చిరంజీవి మళ్లీ వెళ్లి క్యూలైన్‌లో నిల్చుని.. తన వంతు వచ్చాక ఓటేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం 10.30 సమయంలో చిరంజీవి తన భార్య, తనయుడు రాంచరణ్, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి వచ్చారు.
క్యూను వదిలి ముందుకెళ్లిన చిరంజీవిని నిలదీసిన యువకుడు
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవికి ఒక యువ ఓటరు షాకిచ్చారు. ఓటు వేయడానికి క్యూలైనును తోసిరాజని ముందుకు వెళ్లిన ఆయనను.. ఇదేమిటంటూ అందరి ముందూ నిలదీశారు. దీంతో చిరంజీవి మళ్లీ వెళ్లి క్యూలైన్‌లో నిల్చుని.. తన వంతు వచ్చాక ఓటేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం 10.30 సమయంలో చిరంజీవి తన భార్య, తనయుడు రాంచరణ్, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి వచ్చారు. భారీ క్యూలైను ఉండడంతో... కొంత సేపు నిల్చున్నారు. అయితే ఆ పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారి అత్యుత్సాహం చూపి.. ముందుకు రావాలంటూ లోనికి తీసుకెళ్లారు. చూపుడు వేలికి ఇంక్ పెడుతుండగా.. కార్తీక్ అనే ఎన్నారై యువకుడు అడ్డుకున్నారు. మీరు వీఐపీ అయితే మాత్రం కుటుంబ సభ్యులందరితో కలిసి క్యూలైన్ దాటి ముందుకు వెళ్లాలా..? అని నిలదీశారు. తాను ఓటు వేసేందుకు లండన్ నుంచి మంగళవారం మధ్యాహ్నం వచ్చానని.. ఓటు వేయగానే బుధవారం సాయంత్రమే తిరిగి లండన్ వెళ్లాల్సి ఉందని చెప్పారు. దీంతో కంగుతిన్న చిరంజీవి తిరిగి వెనక్కి వెళ్లిపోయి లైన్‌లో నిలుచున్నారు. ఈ ఘటనతో అక్కడున్న ఓటర్లంతా చప్పట్లు కొట్టి కార్తీక్‌ను అభినందించడం కనిపించింది.
ఎవరీ కార్తీక్..?
గంట రాజా కార్తీక్ లండన్‌లోని కేంబ్రిడ్జ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంది. ఓటు వేయడం కోసమే ఆయన లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది.
జాబితాలో పేరు చూసుకునేందుకే వెళ్లా..: చిరంజీవి
జాబితాలో తన పేరు ఉందో లేదో తెలుసుకోవడానికే వెళ్లానని... అంతే తప్పించి ఓటు వేయడానికి ముందుకు దూసుకెళ్లలేదని చిరంజీవి వివరణ ఇచ్చారు. ఓటరు స్లిప్పుపై స్పష్టంగా పోలింగ్ బూత్ పేరు రాసి ఉంది కదా? అని విలేకరులు ప్రశ్నించగా... తాను అది అంతగా గమనించలేదన్నారు. ఇందులో పొరపాటు ఉందన్న విషయం కూడా తనకు తెలియదని.. టీవీల్లో తాను నిబంధనలు ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు