
సాధారణంగానే జలగలను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది రెండు నెలలకు పైగా ఒక వ్యక్తి శరీరంలో జలగలు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఒక వ్యక్తి రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం దగ్గుతుండగా రక్తం పడడంతో అనుమానమొచ్చి సదరు వ్యక్తి ప్యూజిన్ ఫ్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ హాస్పిటల్‌ను సంప్రదించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అతన్ని శ్వాసకోస విభాగానికి సిఫార్సు చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి సిటీ స్కాన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించారు.
రిపోర్టులను పరీక్షించిన డాక్టర్లు ఆ వ్యక్తి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. వెంటనే సదరు వ్యక్తికి మత్తుమందు ఇచ్చి ట్వీజర్ సాయంతో ఆపరేషన్ నిర్వహించి 1.2 ఇంచులు ఉన్న రెండు జలగలను బయటికి తీశారు. ప్రసుత్తం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 'అతని గొంతులోంచి రెండు జలగలను బయటకు తీశాం. ప్రసుత్తం అతని ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆ వ్యక్తి బహుశా జలగలు ఉన్న నీటిని తాగి ఉంటాడు. అయితే అవి కంటికి కనిపించని స్థితిలో ఉండడంతో గుర్తించలేకపోయాడు. కాగా, ఆ జలగలు రెండు నెలలుగా ఆ వ్యక్తి యొక్క రక్తం పీల్చుతూ పెరిగాయని' శ్వాసకోస విభాగధిపతి డాక్టర్ రావు గున్యాంగ్ తెలిపారు.